మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నిర్వహించిన ‘రిపబ్లిక్ సమ్మిట్’లో పాల్గొని తన వ్యక్తిగత, సినీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ, ప్రేక్షకులు కేవలం వారసత్వాన్ని చూసి ఆదరించరని, మన కష్టాన్ని చూసే గుర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. బిజినెస్ కోణంలో మాట్లాడితే.. తన కెరీర్లో ‘పెద్ది’ సినిమా ఒక అద్భుతమైన ‘స్టార్టప్’ లాంటిదని చరణ్ అభివర్ణించారు.
చిన్నప్పటి నుంచి తనపై ఉన్న అంచనాల గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. “నేను చిన్నగా ఉన్నప్పుడు మేకర్స్ అంతా వచ్చి ‘మీ నాన్న కంటే బాగా చేయాలి’ అని చెప్తుంటే అదో పెద్ద బాధ్యతగా అనిపించేది. కానీ నేనెప్పుడూ ఆ ఒత్తిడిని నాపైకి రానివ్వలేదు. ఇంట్లో మా నాన్న (చిరంజీవి) చాలా సరదాగా ఉంటారు. మా డైనింగ్ టేబుల్ మీద సినిమా ముచ్చట్లు గానీ, స్టార్డమ్ గురించిన టాపిక్స్ గానీ ఎప్పుడూ రానిచ్చేవారు కాదు” అని వెల్లడించారు.
వారసత్వంపై చరణ్ మరింత స్పందిస్తూ.. “సినీ నేపథ్యం వల్ల పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ఒక మంచి ప్లాట్‌ఫామ్ దొరుకుతుందనేది నిజం. కానీ మొదటి సినిమా దాటిన తర్వాత ప్రేక్షకులు మనం ఎవరి వారసులమనేది పక్కన పెట్టేస్తారు. కేవలం మన కష్టం, పని పట్ల మనకున్న నిజాయతీని మాత్రమే చూసి ఆదరిస్తారు. నా 15 ఏళ్ల కెరీర్లో నాన్న నాకు ఎప్పుడూ నటన విషయంలో ఫీడ్‌బ్యాక్ ఇవ్వలేదు, వేలు పట్టి నడిపించలేదు. కానీ ఆయనలోని క్రమశిక్షణే నన్ను ఎప్పుడూ నడిపిస్తుంది” అని చెప్పారు.
ప్రస్తుత డిజిటల్ ట్రెండ్, ఓటీటీల ప్రభావంపై కూడా చరణ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. థియేటర్లు, ఓటీటీలు ఒకదానికొకటి తోడ్పడుతూ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఆర్ఆర్ఆర్’ థియేటర్లలో భారీ విజయం సాధించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. ఆ ఓటీటీ క్రేజ్ వల్లే పాశ్చాత్య దేశాల ప్రేక్షకులకు సినిమా మరింత దగ్గరై, ఆస్కార్ నామినేషన్ వరకు వెళ్లేలా బజ్ క్రియేట్ అయింది. జపాన్‌లో కూడా సోషల్ మీడియా బజ్ వల్లే ఏకంగా రూ. 65 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది” అని చరణ్ గుర్తు చేశారు.
ఇప్పటికీ భారతదేశంలో ఒక కుటుంబానికి అత్యంత తక్కువ బడ్జెట్లో దొరికే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమానే అని, అయితే థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు కాస్త తగ్గితే ప్రేక్షకులకు మరింత మేలు జరుగుతుందని చరణ్ అభిప్రాయపడ్డారు. దేశభక్తిని చాటే కథలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని రామ్ చరణ్ పేర్కొన్నారు. “ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా రూ. 500 కోట్లు లేదా రూ. 800 కోట్లు వసూలు చేస్తోందంటే, దేశంలోని ప్రజలంతా ఆ కథను తమ సొంత కథగా ఫీల్ అవుతున్నారని అర్థం. దేశాన్ని ఏకం చేసే ఇలాంటి గొప్ప చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది” అని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముగించారు.