తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైన వేళ, సీఎం విజయ్ (Vijay) నాయకత్వంపై ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R Madhavan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన మిత్రుడు విజయ్ పదవిలోకి వచ్చాక తమిళనాట స్పష్టమైన, సానుకూల మార్పు కనిపిస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలు తన వ్యక్తిగత ఆలోచనల గురించి మాధవన్ మనసు విప్పి మాట్లాడారు.
“విజయ్ను ఇప్పుడు గౌరవంగా సీఎం అని పిలవాల్సిందే!”
విజయ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ మాధవన్ స్పందించారు. “రాష్ట్రంలో ప్రస్తుతం అంతా మంచే జరుగుతోంది. ఇక్కడ ఇంత త్వరగా మార్పు వస్తుందనే నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. విజయ్ నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. కానీ ఇప్పుడు ప్రజా నాయకుడిగా, వ్యవస్థకు అధిపతిగా ఆయనను గౌరవపూర్వకంగా ‘సీఎం విజయ్’ అని పిల్చుకోవాల్సిందే” అని పేర్కొన్నారు.
అలాగే రాజకీయం అనే అంశంపై మాట్లాడుతూ.. “రాజకీయాలు అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివి. అక్కడ ఏ పని చేసినా విమర్శించేందుకు కొందరు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మంచి చేసినా, తప్పు చేసినా విమర్శలు తప్పవు” అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“నాకు సీఎం కావాలని లేదు.. రాజకీయం సరిపడదు!”
తన రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు మాధవన్ ముగింపు పలికారు. “నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదు. పాలిటిక్స్‌లోకి రావాలంటే ముందుగా ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పం ఉండాలి. ప్రజలను నడిపించాలనో లేదా ముఖ్యమంత్రి కావాలో అనే కోరిక నాకు లేదు. ఆ విషయంలో నేను కాస్త స్వార్థపరుడినే. నా నటన ద్వారా, సినీ వృత్తి ద్వారానే నాకు చేతనైనంతలో సమాజానికి సేవ చేస్తాను” అని స్పష్టం చేశారు.
కాగా, ఆర్. మాధవన్ ప్రస్తుతం ప్రముఖ పారిశ్రామికవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘జి.డి.ఎన్’ (GDN) చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తూ బిజీగా ఉన్నారు.