Find Articles

బన్నీ ఫ్యాన్స్‌కి షాక్.. ప్రచారంలో ఉన్నదంతా అబద్ధమే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోయే భారీ ప్రాజెక్టులకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న పలు వార్తలపై కీలక స్పష్టత వచ్చింది. తమిళ క్రేజీ డైరెక్టర్ అట్లీ కలయికలో రానున్న ‘రాకా’తో పాటు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘AA23’ ప్రాజెక్ట్ గురించి నెట్టింట ప్రచారంలో ఉన్న పుకార్లకు చెక్ పడింది.

‘రాకా’ షూటింగ్ విరామం.. షారుఖ్ క్యామియోపై క్లారిటీ!

అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రాకా’ చిత్ర విడుదల తేదీ విషయంలో నిర్మాతలు ఎలాంటి తొందరపడటం లేదు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మరో మూడు నెలలకు పైగా మిగిలి ఉండటం, అలాగే ఆ తర్వాత భారీ స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సి ఉండటమే దీనికి ప్రధాన కారణం. కాగా, గర్భవతిగా ఉన్న కథానాయిక దీపికా పదుకునేకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్ర బృందం ఇప్పటికే పూర్తి చేసి, ఆమె షూటింగ్‌ను జాగ్రత్తగా ముగించింది. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ప్రత్యేక పాత్ర (క్యామియో) చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.

‘AA23’ ప్రచారంపై స్పష్టత.. పూజా హెగ్డే, షాహిద్ నటిస్తున్నారా?

ఇదిలా ఉంటే, అల్లు అర్జున్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్ (AA23) పైనా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ నటిస్తున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుండగా, అందులో వాస్తవం లేదని, కనీసం ఆయన పేరు పరిశీలనలో కూడా లేదని తెలుస్తోంది. ఇక ‘కూలీ’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినంత మాత్రాన పూజా హెగ్డేనే ఈ సినిమాలో హీరోయిన్‌గా లాక్ చేశారనే వార్తల్లోనూ నిజం లేదని సమాచారం.

ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తన ‘డిసి’ (DC) సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నందున, మరో నెల రోజుల్లో ‘AA23’ కి సంబంధించిన పనులను పూర్తి స్థాయిలో వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది.

Keerthi