Find Articles

బికినీ రాఖీ వివాదం: కంగనాకి కృతి సనన్ గట్టి కౌంటర్!

రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ నటించిన ఒక వాణిజ్య ప్రకటన (Commercial Ad) ప్రస్తుతం నెట్టింట తీవ్ర వివాదానికి దారితీసింది. పవిత్రమైన రాఖీ పండగ వేళ సాంప్రదాయ దుస్తులు ధరించకుండా బికినీ లూక్‌లో కనిపించడం, అలాగే పెంపుడు శునకానికి రాఖీ కట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఎంపీ, నటి కంగనా రనౌత్ కూడా కృతిపై విరుచుకుపడ్డారు. “ఈ రోజుల్లో మహిళలకు లెహంగాలు, సల్వార్ కమీజ్, చీరలు వంటి ఎన్నో సంప్రదాయ ఆప్షన్లు ఉన్నాయి. కానీ రాఖీ లాంటి పండుగ రోజు బికినీ ధరించి రాఖీ కడతారా?” అని కంగన ఘాటుగా ప్రశ్నించారు. ఈ రచ్చపై తాజాగా కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా స్పందించి విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

దుస్తులతో సంస్కృతిని కొలవడం ఎప్పుడు ఆపుతారు?

తన వస్త్రధారణపై వచ్చిన విమర్శలను కృతి సనన్ తీవ్రంగా ఖండించారు. “మహిళలు ఫలానా దుస్తులే వేసుకోవాలని చెప్పడాన్ని సమాజం ఎప్పుడు ఆపుతుంది? ఒక మహిళ ధరించే దుస్తులను, ఆమెకు సంస్కృతి పట్ల ఉన్న గౌరవంతో ముడిపెట్టడం సరికాదు. పండుగ పరమార్థం వేసుకునే దుస్తుల్లో ఉండదు.. మనస్సులోని భావోద్వేగాల్లో ఉంటుంది. రోజులు మారే కొద్దీ ఫ్యాషన్ మారుతుంది. సంస్కృతి, సంప్రదాయాలు హృదయంలో ఉంటాయి తప్ప, వేసుకునే బట్టల్లో కాదు” అని కృతి ఘాటుగా బదులిచ్చారు.

పెంపుడు శునకానికి రాఖీపై స్పష్టత!

ఇక పెంపుడు శునకానికి రాఖీ కట్టడంపై వస్తున్న వివాదంపై స్పందిస్తూ.. “రక్షాబంధన్ అనేది కేవలం సోదరుడికే కాదు, పరస్పరం రక్షణగా నిలిచే ఏ బంధానికైనా ప్రతీక. నేను, నా సోదరి ప్రతి ఏటా ఒకరికొకరం రాఖీ కట్టుకుంటాం. ఇక మా ఇంట్లోని పెంపుడు శునకాలు కూడా మా కుటుంబంలో ఒక భాగమే. వాటి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తూ రాఖీ కట్టడంలో ఎలాంటి తప్పులేదు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కృతి సనన్ చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లోను, సోషల్ మీడియాలోను సరికొత్త చర్చకు దారితీశాయి.

Keerthi