Find Articles

టామ్ క్రూజ్ సినిమా నుండి జీ5 ‘మేము కాప్’లం’ దాకా..: సినిమాటోగ్రాఫర్ కిషోర్ విజువల్ జర్నీ!

సినిమా అంటేనే ఒక అద్భుత ప్రపంచం. తెరపై మనం చూసే ప్రతి దృశ్యం వెనుక ఎందరో కళాకారుల కష్టం ఉంటుంది. అందులో దర్శకుడి ఊహలకు ప్రాణం పోస్తూ, నిర్మాత బడ్జెట్‌కు వంద రెట్ల విలువను జోడించే కీలక బాధ్యత సినిమాటోగ్రాఫర్‌ది. ఒక సినిమాకు దర్శకుడు తల్లి అయితే, ఆ సినిమాను ఆద్యంతం భుజాన వేసుకుని నడిపించే ‘పెద్ద కొడుకు’ సినిమాటోగ్రాఫర్ అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి బాధ్యతాయుతమైన విభాగంలో తనదైన ముద్ర వేస్తూ, హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన ప్రతిభను చాటుకుంటున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడాపు.

దుర్గ కిషోర్ కుమార్ అనే అసలు పేరున్న కిషోర్, సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుండి రావడంతో చిన్నప్పటి నుంచే దృశ్యమాలికలపై ఆసక్తి పెంచుకున్నారు. “మా నాన్న ఫోటోల ద్వారా కథలు చెప్పేవారు. ఆ అనుభవమే నన్ను కెమెరా వైపు మళ్లించింది” అని ఆయన తన ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటారు. 2002లో కెమెరా అసిస్టెంట్‌గా ప్రారంభమైన ఆయన ప్రయాణం, ‘స్లమ్ డాగ్ మిలియనీర్’, ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు పనిచేసే స్థాయికి చేరుకుంది. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా దగ్గర ప్రధాన అసిస్టెంట్‌గా పనిచేయడం తన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని, ఆయన ప్రోత్సాహంతోనే ఇప్పుడు స్వతంత్రంగా రాణిస్తున్నానని కిషోర్ చెబుతారు.

ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతూ విశేష ఆదరణ పొందుతున్న ‘మేము కాప్’లం’ సిరీస్‌ను కేవలం 17 రోజుల్లో షూట్ పూర్తి చేయడం వెనుక గొప్ప టీమ్ వర్క్ ఉందని కిషోర్ వివరించారు. “దర్శకుడు ప్రదీప్ మద్దాలి గారితో కలిసి ముందుగానే పూర్తి స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ చేసుకున్నాం. ఏ సీన్ ఎలా ఉండాలి, ఎంత లైటింగ్ వాడాలి అనే దానిపై స్పష్టత ఉండటంతో షూటింగ్ వేగంగా పూర్తి చేయగలిగాం. నాగబాబు గారు, నిర్మాత బీవీఎస్ రవి గారు మరియు టీమ్ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు.

హాలీవుడ్ సినిమాలకు, మన సినిమాలకు ఉన్న దృశ్యపరమైన తేడాలను ఆయన విశ్లేషిస్తూ— “హాలీవుడ్ వారు సహజత్వానికి, రియలిస్టిక్ లైటింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇండియన్ సినిమాల్లో ఎమోషన్స్, సంస్కృతి, రంగులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. మన కథలు, కాస్ట్యూమ్స్, పండగలు.. వీటన్నింటినీ బట్టి మన లైటింగ్, కలర్ టోన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ కనెక్టివిటీనే మన సినిమాలను ప్రత్యేకంగా నిలబెడుతుంది” అని అభిప్రాయపడ్డారు.

సింగిల్ షాట్ సినిమాల గురించి మాట్లాడుతూ.. హన్సిక ప్రధాన పాత్రలో నటించిన ‘105’ మూవీని ఉదహరించారు. “సింగిల్ షాట్ అంటే అది కత్తి మీద సాము లాంటిది. చిన్న పొరపాటు జరిగినా మళ్ళీ మొదటి నుండి చేయాల్సి వస్తుంది. ప్రేక్షకులకు ఆ తెర వెనుక ఉన్న కష్టం తెలియదు, కానీ వారికి ఆ అనుభవం కొత్తగా ఉండాలన్నదే మా ప్రయత్నం” అని చెప్పారు.

ప్రస్తుతం కిషోర్ బోయిడాపు, షణ్ముఖ్ హీరోగా నటిస్తున్న ‘ప్రేమకు నమస్కారం’, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో వస్తున్న ‘మన డాక్టర్ బాబు’ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. దర్శకత్వం చేసే ఆలోచన ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం కొత్త సాంకేతికత, ముఖ్యంగా ఏఐ (AI) నేర్చుకోవడంపై దృష్టి పెట్టానని కిషోర్ తెలిపారు.

Keerthi