భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్, నటనతో ‘సూపర్‌స్టార్’గా చెరగని ముద్ర వేసుకున్న రజినీకాంత్ (Rajinikanth) జీవిత ప్రయాణం అంటే ప్రేక్షకులలో ఉండే క్రేజ్ వేరు. బస్ కండక్టర్ స్థాయి నుంచి భారతీయ సినిమాను శాసించే స్థాయికి ఎదిగిన ఆయన రజినీ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. కొంతకాలంగా తన జీవిత అనుభవాలతో ఆత్మకథ (Autobiographical Book) రాసుకోవడంపై దృష్టి పెట్టిన తలైవా.. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పుస్తకంతో పాటు సినిమాయే లక్ష్యంగా!
తాజా సమాచారం ప్రకారం.. రజినీకాంత్ తన ఆత్మకథను కేవలం ఓ పుస్తక రూపానికే పరిమితం చేయకుండా, దాని ఆధారంగా ఓ బయోపిక్ చిత్రాన్ని రూపొందించే దిశగా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా తన వ్యక్తిగత విషయాలను ఎంతో ప్రైవేట్‌గా ఉంచే రజినీ, తన సినీ ప్రయాణంలోని ఒడిదొడుకులు, కష్టాలు మరియు ఇప్పటివరకు బయటకు రాని ఆసక్తికరమైన విషయాలను వెండితెరపై చూపించాలని భావిస్తున్నట్లు సమాచారం.
అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
ప్రస్తుతానికి ఈ బిగ్ ప్రాజెక్ట్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, భవిష్యత్తులో రజినీ ఆటోబయోగ్రఫీ సినిమాగా రూపుదిద్దుకోవడం దాదాపు ఖాయమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతోనే అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రజినీకాంత్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అందులో భాగంగానే ఆయన త్వరలోనే సూపర్ హిట్ చిత్రం ‘జైలర్’ కు సీక్వెల్‌గా రాబోతున్న ‘జైలర్-2’ (Jailer 2) తో థియేటర్లలో సందడి చేయనున్నారు.