ఈ విజయదశమికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ దక్కించుకున్న బయోపిక్ చిత్రం ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi). ఉత్తరాంధ్రకు చెందిన ప్రముఖ బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నటి ఆనంది (Anandhi) తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయ సాధించడంతో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము పంచుకున్న ఒక ఆసక్తికరమైన నిజం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఆనంది కంటే ముందే స్టార్ హీరోయిన్లు రిజెక్ట్:
ఈ విజయోత్సవ వేదికపై దర్శకుడు గౌరీ నాయుడు జమ్ము మాట్లాడుతూ…. ‘గరివిడి లక్ష్మి’ పాత్ర కోసం ఆనంది కంటే ముందే టాలీవుడ్ టాప్ హీరోయిన్లు సాయి పల్లవి, నివేదా థామస్, నిత్యా మీనన్‌లను సంప్రదించగా, వారు కొన్ని కారణాల వల్ల ఈ పాత్రను రిజెక్ట్ చేశారన్నారు. ఈ బయోపిక్ కథను ముందుగా సాయి పల్లవికి వినిపించాం. ఆ తర్వాత నివేదా థామస్, నిత్యా మీనన్ వంటి ప్రతిభావంతులైన నటీమణులకు కూడా కథ చెప్పాం. కానీ రకరకాల కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పలేకపోయారు” అని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ రోల్ చేయడానికి ఒప్పుకోవడంపై ఆనంది స్పందిస్తూ.. “ఉత్తరాంధ్ర మట్టి నుంచి వచ్చిన గరివిడి లక్ష్మి లాంటి గొప్ప బుర్రకథ కళాకారిణి చరిత్ర అందరికీ తెలియాలి. అందుకే ఈ పాత్ర చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను. థియేటర్లలో ప్రేక్షకులనుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.
రవితేజ ప్రశంసల వర్షం!
ఈ సినిమా సాధించిన విజయంపై సినీ ప్రముఖులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “గరివిడి లక్ష్మి బయోపిక్ నా మనసును లోతుగా కదిలించింది. చిత్రంలో చూపించిన ఆత్మీయత, స్వచ్ఛమైన భావోద్వేగాలు కట్టుపడేలా ఉన్నాయి. లక్ష్మి గారి పాత్రలో ఆనంది కేవలం నటించలేదు, జీవించింది” అని చిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు.