అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రసారమవుతున్న సైకలాజికల్ రియాలిటీ షో ‘ది ట్రేటర్స్’ తెలుగు ప్రేక్షకులను సరికొత్త ఉత్కంఠలోకి నెట్టేస్తోంది. తేజ సజ్జ తనదైన శైలిలో నడిపిస్తున్న ఈ మైండ్ గేమ్‌లో ఆరు ఎపిసోడ్లు ముగిసేసరికి సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. మొదట్లో కేవలం స్నేహం, సరదాలకే పరిమితమైన ప్యాలెస్ వాతావరణం కాస్తా ఇప్పుడు ప్రతీకారం, పక్కా ఎత్తుగడలతో రణరంగంగా మారింది. ఈ మొత్తం ఆటలో కేంద్రబిందువుగా మారి, షోను తదుపరి స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి డైరెక్టర్ జె.ఎస్.ఎస్. వర్ధన్.
‘గీతా సుబ్రహ్మణ్యం’, ‘హలో వరల్డ్’, ‘భలే ఉన్నాడే’ వంటి ప్రాజెక్ట్‌లతో దర్శకుడిగా మెప్పించిన వర్ధన్, ఇక్కడ కేవలం ఆలోచనలతోనే కాదు.. శారీరక దారుఢ్యం అవసరమైన టాస్కుల్లోనూ తిరుగులేని ఆటతీరును ప్రదర్శిస్తున్నారు. ప్రారంభంలో అమాయకంగా కనిపించినా, వరుసగా తన సన్నిహితులైన చిన్మయి, నిఖిల్, గౌరవ్‌లు హత్యకు గురికావడంతో ఆయన అసలు గేమ్‌ను మొదలుపెట్టారు. గౌరవ్ అమాయకుడని గట్టిగా నమ్మి మద్దతు పలకడమే కాక, మిత్రుల ఎలిమినేషన్‌కు కారణమైన విద్యుల్లేఖను తన పదునైన తర్కంతో ‘రింగ్ ఆఫ్ డౌట్’ వేదికగా ట్రేటర్‌గా నిరూపించి బయటకు పంపడంలో వర్ధన్ వ్యూహం కీలకమైంది.
అంతేకాదు, ఆటలో ట్రేటర్ రాహత్ ఎత్తుగడలను పసిగట్టి బట్టబయలు చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓటింగ్‌లో మోనిషా వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ, ఆమెను టాస్క్‌లో కాపాడి తనవైపు తిప్పుకోవాలన్న రాహత్ నిగూఢ ఆలోచనను వర్ధన్ విడమరిచి చెప్పడంతోనే రాహత్ ఆట ముగిసింది. ఎవరూ గుర్తించలేని చిన్న అంశాలను కూడా పసిగట్టే ఆయన సూక్ష్మబుద్ధి మిగిలిన పార్టిసిపెంట్స్‌ను ఆలోచనలో పడేసింది.

సెన్సేషనల్ ట్విస్ట్: వర్ధన్ ఓపెన్ ఛాలెంజ్ – మైండ్ గేమా లేక సూసైడ్ అటెంప్టా?
ఇప్పటివరకు ఒక ఎత్తయితే, ఆరో ఎపిసోడ్ ముగింపులో వర్ధన్ విసిరిన సవాల్ షోకే అతిపెద్ద సెన్సేషన్‌గా మారింది. హర్షవర్ధన్ సహా కొందరు ఆయనపై అనుమానం పెంచుకుంటున్న తరుణంలో, వర్ధన్ ఏకంగా ట్రేటర్లకే నేరుగా హెచ్చరిక జారీ చేశారు:
“మై డియర్ ట్రేటర్… దమ్ముంటే ఈరోజు రాత్రి నన్ను బతికించు! రేపు మాత్రం నేను నిన్ను చంపేస్తా!!”
ఈ ఒక్క డైలాగ్‌తో షోలో పెను దుమారం రేగింది. తనను తాను టార్గెట్ చేసుకునేలా ఇంతటి ఓపెన్ ఛాలెంజ్ విసరడం వెనుక ఉన్న వ్యూహమేంటి? ఇది అహంకారమా లేక ట్రేటర్లను మైండ్ గేమ్‌తో ట్రాప్ చేయడానికి వేసిన మాస్టర్ ప్లానా? అన్నది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం వర్ధన్ నేరుగా హిట్ లిస్ట్‌లోకి వచ్చేశారు. టాస్క్‌లో రక్షణ లభించకపోవడంతో శ్రావ్య, ధనుంజయ్‌లతో పాటు వర్ధన్ కూడా ఇప్పుడు ఆషికా కత్తికి అత్యంత సమీపంలో నిలిచారు. ఉదయం డైనింగ్ టేబుల్ వద్ద ఎవరు లేరన్న వార్త రానుందో తెలియక పార్టిసిపెంట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. ట్రేటర్లను వణికించిన వర్ధన్ గేమ్‌ను ఇక్కడితో ముగిస్తారా, లేక ఈ సవాల్‌ను ఎదుర్కొని తనే ట్రేటర్లను వేటాడతారా అన్నది తేలాలంటే వచ్చే గురువారం నాటి ఎపిసోడ్ చూడాల్సిందే.