Find Articles

మహేష్ వ్యాఖ్యలను బయటపెట్టిన ఘట్టమనేని వారసుడు!

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఘట్టమనేని కాంపౌండ్ నుంచి మరో కొత్త హీరో వెండితెరకు పరిచయమవుతున్నారు. ఆయనే జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni). డైనమిక్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఆయన నటించిన తొలి చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). పి. కిరణ్ నిర్మాణం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ సమర్పిస్తున్నారు. జులై 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో జయకృష్ణ విలేకరులతో ముచ్చటించి పలు విశేషాలు పంచుకున్నారు.

“మహేష్ బాబాయ్ గైడెన్స్ మరువలేనిది!”

తన డెబ్యూ మూవీ గురించి మాట్లాడే క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అందించిన ప్రోత్సాహం గురించి జయకృష్ణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “బాబాయ్ మహేష్ నాకు ప్రతి విషయంలోనూ మార్గదర్శకం వహిస్తారు. ఆయన ఇప్పటికే ఈ సినిమాను చూసి చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు, పాటలు ఆయనకు బాగా నచ్చాయి. స్క్రీన్ మీద నా లుక్స్, క్యారెక్టర్‌లో నేను ఒదిగిపోయిన తీరును బాబాయ్ ఎంతగానో మెచ్చుకున్నారు. బాబాయ్ తొలి సినిమా వచ్చిన వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారానే నేను పరిచయం కావడం నా అదృష్టం” అని ఆనందం వ్యక్తం చేశారు.

శిక్షణ తర్వాతే ఎంట్రీ.. రియలిస్టిక్ డ్రామా!

చిన్నప్పటి నుంచే సినిమాలపై ఉన్న ఆసక్తితో ముంబయి, పుదుచ్చేరి, న్యూయార్క్‌లలో రెండేళ్ల పాటు నటనలో కఠిన శిక్షణ తీసుకున్నట్లు జయకృష్ణ తెలిపారు. “జెమినీ కిరణ్‌గారు నన్ను అజయ్ భూపతికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన కథలోని ఎమోషన్, నా క్యారెక్టర్ నాకు బాగా నచ్చాయి. ‘శ్రీనివాస మంగాపురం’ చాలా రస్టిక్‌గా, రియలిస్టిక్‌గా సాగే వైవిధ్యమైన లవ్‌స్టోరీ. 70 రోజుల పాటు పబ్లిక్ లోనే ఈ సినిమా షూటింగ్ చేశాం. సినిమాలో నటించిన సీనియర్ నటుడు మోహన్‌బాబుగారి నుంచి సెట్స్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను” అని వెల్లడించారు.

యాక్షన్ సినిమాలంటే ప్రాణం!

నటుడిగా అన్ని రకాల జోనర్లలో నటించాలని ఉన్నప్పటికీ, పర్సనల్‌గా తనకు యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టమని, అందుకే నటుడవక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నానని జయకృష్ణ చెప్పారు. ఈ చిత్రంలో రషా థడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా నటించగా, మోహన్‌బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఘట్టమనేని అభిమానుల నమ్మకాన్ని నిలబెడుతూ మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తానని జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

Keerthi