Find Articles

సీఎం విజయ్‌పై కౌంటర్? వర్సటైల్ యాక్టర్ మాటల వివాదంపై స్టార్ విజయ్ క్లారిటీ!

తమిళ బిగ్‌బాస్ 10వ సీజన్ హోస్ట్, కోలీవుడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ వర్గాలతో పాటు తమిళనాడు రాజకీయంలో సంచలనం రేపాయి. బిగ్‌బాస్ వేదికపై కంటెస్టెంట్ల గేమ్‌ను విశ్లేషించే క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ నాయకులపై పరోక్ష విమర్శల్లా ఉన్నాయంటూ వివాదం మొదలైంది. ఈ రచ్చ కాస్తా పెద్దది కావడంతో ప్రసార సంస్థ స్టార్ విజయ్ టీవీ రంగంలోకి దిగి క్లారిటీ ఇస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

నాయకుడి లక్షణాలపై కామెంట్.. టీవీకే వర్సెస్ విజయ్ సేతుపతి!

బిగ్‌బాస్ హౌస్‌లోని కంటెస్టెంట్లకు క్లాస్ పీకుతున్న సమయంలో విజయ్ సేతుపతి మాట్లాడుతూ “నెరవేర్చలేని హామీలు ఇవ్వడం, సమస్యలు ఎదురైనప్పుడు ఎదుటివారిపై నిందలు వేస్తూ తప్పించుకోవడం ఒక సరైన నాయకుడి లక్షణం కాదు” అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు నెట్టింట వైరల్ కావడంతో, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, దళపతి విజయ్‌ను ఉద్దేశించే సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారంటూ టీవీకే నేతలు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా విజయ్ సేతుపతిపై ట్రోలింగ్, విమర్శల వర్షం కురిపించారు.

రంగంలోకి దిగిన స్టార్ విజయ్.. వివాదానికి చెక్!

రాజకీయ రచ్చ ముదిరిపోవడంతో స్టార్ విజయ్ ఛానల్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. బిగ్‌బాస్ అనేది కేవలం ప్రజలకు వినోదాన్ని పంచే ఒక రియాలిటీ షో మాత్రమేనని, అందులో హోస్ట్,  కంటెస్టెంట్ల మధ్య జరిగే సంభాషణలు కేవలం ఆ ఆటకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. ఈ మాటలకు రాజకీయ లేదా వర్తమాన వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని, ఎవరినీ ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేస్తూ ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేసింది.

Keerthi