Find Articles

జియోహాట్‌స్టార్‌లో బిగ్‌బాస్ తెలుగు నయా రికార్డ్… సంచలనంగా మారిన ‘సౌత్ కార్నివల్’ ప్రయోగం!

బుల్లితెర చరిత్రలోనే తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు’ మరోసారి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నడిపిస్తున్న ఈ షో, ప్రస్తుతం ‘జియోహాట్‌స్టార్’ తెలుగు విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని దూసుకుపోతోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రేక్షకులను కట్టిపడేస్తూ, అటు టెలివిజన్ రేటింగ్స్‌తో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ భారీ చర్చకు తెరలేపింది. అంతర్జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందిన ఈ షో ఫార్మాట్‌ను బనిజే ఆసియాకు చెందిన ‘ఎండెమోల్ షైన్ ఇండియా’ భారతీయ ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా మలిచి మరోసారి అద్భుత విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియోహాట్‌స్టార్‌లో వివిధ భాషల్లో బిగ్‌బాస్ హవా కొనసాగుతుండగా, తెలుగు వర్షన్ నంబర్ వన్ స్థానంలో నిలిచి తన తిరుగులేని పట్టును నిరూపించుకుంది.

సంచలనంగా మారిన ‘బిగ్ బాస్ సౌత్ కార్నివల్’ అనుసంధానం

ఈ సీజన్ ప్రారంభంలో బిగ్‌బాస్ చరిత్రలోనే కనివినీ ఎరుగని ఒక అనూహ్య ప్రయోగం బుల్లితెర వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. దక్షిణాది భాషలన్నింటిలోనూ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం) ఒకే రోజు ఒకేసారి షోను ప్రారంభించడమే కాకుండా, నలుగురు అగ్ర కథానాయకులు ఒకే వేదికపై పరోక్షంగా ముఖాముఖి పలకరించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.

నలుగురు స్టార్ల ఒకే ఫ్రేమ్:

తెలుగు నుంచి నాగార్జున, తమిళం నుంచి విజయ్ సేతుపతి, మలయాళం నుంచి మోహన్‌లాల్, కన్నడ నుంచి కిచ్చా సుదీప్ తమ తమ వేదికల నుంచే వర్చువల్‌గా ఒక్కటై పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం అటు అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా, సోషల్ మీడియాలో సరికొత్త చర్చలకు తావిచ్చింది.

పోటీనా లేక మైత్రా?

ఎప్పుడూ ఒకరితో ఒకరు టీఆర్పీల కోసం పోటీపడే ఈ నాలుగు భాషల బిగ్‌బాస్ ఫ్రాంచైజీలను ఒకే తాటిపైకి తెచ్చి “సౌత్ కార్నివల్” పేరుతో ఏకకాలంలో విడుదల చేయడం దక్షిణాది వినోద రంగంలోనే ఒక అరుదైన వ్యూహాత్మక అడుగుగా నిలిచింది.

ఈ భారీ హైప్, స్టార్ల కలయిక వెరసి బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కు డిజిటల్ మాధ్యమంలో కనీవినీ ఎరుగని వ్యూవర్‌షిప్‌ను తెచ్చిపెట్టింది. వివాదాలు, రసవత్తర టాస్క్‌లు, కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలతో రాబోయే రోజుల్లో ఈ రేటింగ్స్ ఇంకెన్ని రికార్డులను తిరగరాస్తాయో చూడాలి!

Keerthi