తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన మ్యూజికల్ మార్క్ వేసిన ఘంటాడి కృష్ణ, ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవలే అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సినిమా గురించి హీరో సందీప్ అశ్వ ఏమన్నారంటే..
నటనపై ఉన్న ప్యాషన్‌తో షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోల నుంచి వెండితెర వరకు సాగిన తన పదేళ్ల ప్రయాణాన్ని సందీప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. “ఈ సినిమా నా జీవితంలో ఒక మరుపురాని ప్రయాణం. ఇందులో లవ్, ఎమోషన్, యాక్షన్.. ఇలా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగితే, సెకండ్ హాఫ్ మంచి థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఘంటాడి కృష్ణ గారి సంగీతం ఈ సినిమాకు ప్రాణం” అని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ కనకాల, దువ్వాసి మోహన్ వంటి సీనియర్ నటులతో కలిసి నటించడం తన అదృష్టమని ఆయన చెప్పారు.
సంగీత దర్శకుడిగా ఎన్నో చార్ట్ బస్టర్ పాటలు అందించిన ఘంటాడి కృష్ణ, ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ ‘GK మిరాకిల్స్’ పై రూపొందించారు. “ముందు ఈ చిత్రానికి ’16-2′ అని పేరు అనుకున్నాం. కానీ హీరో సందీప్ సలహాతో ‘రిస్క్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశాం. సినిమా చాలా బాగా వచ్చింది, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని ఆయన అన్నారు.
ట్రైలర్ చూసిన అతిథులు, ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. విజువల్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయని, సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచుతోందని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, సినిమా థియేటర్‌లో చూడాల్సిన థ్రిల్లర్ అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి కొనియాడారు. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా GK మిరాకిల్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.