ఉత్తర అమెరికా తెలుగు సమాజంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ ‘నాట్స్’ (NATS – ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ) సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. 2026-2028 కాలానికి గాను నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ)ని నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అధికారికంగా ప్రకటించింది. సేవకు మారుపేరుగా నిలిచే ఈ ప్రతిష్ఠాత్మక సంస్థను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు, ప్రవాస తెలుగువారికి అండగా నిలిచేందుకు నూతన అధ్యక్షుడిగా ప్రముఖ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ రాజ్ అల్లాడను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈసారి ప్రకటించిన కార్యవర్గంలో అనుభవజ్ఞులతో పాటు ఉత్సాహవంతులైన యువ నాయకత్వానికి పెద్దపీట వేశారు.
అధ్యక్షుడు: రాజ్ అల్లాడ
వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్): రాజేష్ కండ్రు
వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ & మార్కెటింగ్): అనుదీప్ అర్లా
వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్): రాజ్యలక్ష్మి చిలుకూరి
కార్యదర్శి: సుధీర్ మిక్కిలినేని
ఖజాంచీ: రామ్ నరేష్ కొమ్మనబోయిన
జాయింట్ సెక్రటరీ: భాను లంక
జాయింట్ ట్రెజరర్: వెంకట సాకమూరి
న్యూజెర్సీలో టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న రాజ్ అల్లాడకు నాట్స్‌తో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. 2009లో కేవలం ఒక సాధారణ వాలంటీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, తన నిరంతర శ్రమ, నిబద్ధతతో బోర్డ్ మెంబర్ స్థాయికి ఎదిగారు. 2023లో డిప్యూటీ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టి, న్యూజెర్సీలో జరిగిన ‘నాట్స్ సంబరాలను’ అత్యంత వైభవంగా నిర్వహించి రికార్డు సృష్టించారు.
సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమకూర్చడంలో, వాలంటీర్లందరినీ ఒకే తాటిపైకి తెచ్చి నడిపించడంలో ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ అమోఘం. కమ్యూనిటీకి అవసరమైన సమయాల్లో తక్షణమే స్పందిస్తూ, ఆపదలో ఉన్న ఎంతోమంది తెలుగువారికి ఆయన కొండంత అండగా నిలిచారు.