Find Articles

పవన్ కళ్యాణ్‌తో రామ్ చరణ్ ‘మెగా’ భేటీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాబాయ్‌తో గడిపిన ఈ స్పెషల్ మూమెంట్స్‌కు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి విలువైన సమయాన్ని గడపడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అమరావతిలో కొత్తగా నిర్మితమవుతున్న జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ భవన పురోగతిని రామ్ చరణ్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “అమరావతిలోని కొత్త జనసేన పార్టీ ఆఫీస్ డెవలప్‌మెంట్స్ చూడటం చాలా సంతోషంగా అనిపించింది. భవిష్యత్తులో జనసేన పార్టీ మరిన్ని అద్భుతమైన విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను” అని చరణ్ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

రామ్ చరణ్ అమరావతి పర్యటనలో భాగంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ‘ఆంధ్ర ప్రీమియర్ లీగ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ ముగిసిన అనంతరం ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లారు.జనసేన కేంద్ర కార్యాలయంలో రామ్ చరణ్ దాదాపు 20 నిమిషాల పాటు గడిపారు. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో ఆత్మీయంగా ముచ్చటించి, పార్టీ నూతన భవన సముదాయాన్ని ఆసక్తిగా తిలకించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మెగా అభిమానులంతా ఈ విజువల్స్‌ను ‘మెగా మూమెంట్‌’ అనే క్యాప్షన్‌తో నెట్టింట తెగ షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

Keerthi