Find Articles

రాజమౌళి టాప్ డైరెక్టర్ కాదు.. పృథ్వీరాజ్ సుకుమారన్ షాకింగ్ కామెంట్స్!

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ పాల్గొని, ఈ సినిమా షూటింగ్ అనుభవాలను, జక్కన్న వర్కింగ్ స్టైల్‌ను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజమౌళి కేవలం గొప్ప దర్శకుడు మాత్రమే కాదని, ఆయనలోని నటుడిని చూసి తానే ఆశ్చర్యపోయానని కొనియాడారు.

మోహన్‌లాల్ తర్వాత ఆయనే..
గతంలో మోహన్‌లాల్ దర్శకత్వం వహించిన ‘బరోజ్’ సినిమాలో తాను ఒక చిన్న పాత్ర కోసం వారం రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నానని పృథ్వీరాజ్ గుర్తు చేసుకున్నారు. “ఆయన తర్వాత నన్ను డైరెక్ట్ చేసిన మరో గొప్ప నటుడు రాజమౌళి గారే అని నిస్సందేహంగా చెప్పగలను. సెట్స్‌లో ఏదైనా సీన్ వివరించేటప్పుడు ఆయన ఆ క్యారెక్టర్‌లో పూర్తిగా లీనమైపోతారు. సన్నివేశానికి కావాల్సిన హావభావాలు, ఎమోషన్స్ అన్నీ స్వయంగా తన ముఖంలో పలికించి చూపిస్తారు. నటీనటులకు పాత్రపై పూర్తి స్పష్టత రావడం కోసం ఆయన సెట్లోనే జీవించి చూపిస్తారు” అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

సెట్స్‌లో చిన్నపాటి యుద్ధమే జరిగింది!
రాజమౌళి విజన్ చాలా భిన్నంగా ఉంటుందని పృథ్వీరాజ్ తెలిపారు. “ఒక్కోసారి ఆయన చెప్పే సీన్స్ నాకు అంత త్వరగా అర్థమయ్యేవి కావు. వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆయన ఆలోచనలకు, నా యాక్టింగ్‌కు మధ్య సెట్స్‌లో ఒక చిన్నపాటి యుద్ధమే నడిచేది. కానీ ఆయనపై ఉన్న నమ్మకంతో జక్కన్న ఎలా చెబితే అలా చేశాను. ఆ తర్వాత ఎడిటింగ్ రూమ్‌లో అవుట్‌పుట్ చూసినప్పుడు.. ‘అబ్బా.. ఇంత గొప్పగా ఈ సీన్ ప్లాన్ చేశారా!’ అని నోరెళ్లబెట్టాను. ఆయనతో వర్క్ చేయడం వల్ల ఒక నటుడిగా, దర్శకుడిగా నాలో ఎంతో పరిణతి వచ్చింది” అని చెప్పుకొచ్చారు.

లంచ్ బ్రేక్ 20 నిమిషాలే.. మాకంటే ముందే సెట్స్‌కు!
రాజమౌళిలా కష్టపడే టెక్నీషియన్‌ను తానెక్కడా చూడలేదని పృథ్వీరాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఉదయం 7 గంటలకు ఫస్ట్ షాట్ ఉంటే, రాజమౌళి గారు తెల్లవారుజామునే 5:15 కల్లా సెట్స్‌లో ఉంటారు. నేను, మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా సెట్స్‌కు వచ్చే సమయానికి ఆయన తన అసిస్టెంట్లతో కలిసి కనీసం 12 సార్లు రిహార్సల్స్ పూర్తి చేసి, కెమెరా క్రేన్లతో సహా అంతా రెడీగా ఉంచుతారు. మమ్మల్ని మాత్రం అంత త్వరగా రావద్దని చెబుతారు. ఇక లంచ్ బ్రేక్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుంది.”

90 టేక్‌లు.. కొత్త దర్శకుడిలా కసి!
ఇండస్ట్రీలో ఎన్నో ఇండస్ట్రీ హిట్లను అందుకున్నప్పటికీ, రాజమౌళి ప్రతి సినిమాను తన మొదటి చిత్రంగానే భావిస్తారని పృథ్వీరాజ్ అన్నారు. “తన ఫస్ట్ మూవీ ఛాన్స్ కోసం 20, 30 ఏళ్లు వెయిట్ చేసి, ఆ అవకాశం వచ్చాక ఎంత కసితో వర్క్ చేస్తారో.. రాజమౌళి గారిలో అదే కసి కనిపిస్తుంది. పర్ఫెక్షన్ కోసం ఒక్కో షాట్‌ను 90 టేక్‌లకు పైగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదయం 5 గంటల నుంచి రాత్రి వరకు షూట్ చేసినా.. ఆయన అనుకున్న అవుట్‌పుట్ రాకపోతే, మరుసటి రోజు కూడా అదే సీన్‌ను మళ్లీ రీషూట్ చేస్తారు” అంటూ జక్కన్న అంకితభావాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ ఆకాశానికెత్తారు.

Keerthi