Find Articles

థియేటర్లలోకి మున్నా భయ్యా ‘మీర్జాపూర్’.. రిలీజ్ డేట్ ఫిక్స్!

ఓటీటీ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసిన బాలీవుడ్ కల్ట్ బ్లాక్‌బస్టర్ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నార్త్ టూ సౌత్ ఈ క్రైమ్ డ్రామా సిరీస్‌కు, ఇందులో ఉన్న క్యారెక్టర్లకు కోట్లల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌లోనూ ఈ సిరీస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే ఇప్పుడీ మీర్జాపూర్ ప్రపంచం డిజిటల్ స్క్రీన్‌ను దాటి వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ ఆధారంగా నిర్మిస్తున్న ‘మీర్జాపూర్: ది మూవీ’ బిగ్ స్క్రీన్ ఎంట్రీకి డేట్ లాక్ అయింది. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన పలు పవర్‌ఫుల్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ అఫీషియల్ అప్‌డేట్ ఇచ్చింది. మీర్జాపూర్ సామ్రాజ్యాన్ని శాసించిన కాలీన్ భయ్యా, గుడ్డు భయ్యా, మున్నా భయ్యా పాత్రలతో పాటు ఆ సిరీస్ ప్రాణమైన ఆ ప్రతిష్టాత్మక ‘గద్దీ’ (సింహాసనం) పోస్టర్లను విడుదల చేశారు. “గద్దీ హై తో హమ్ హై” అంటూ మేకర్స్ సినిమాపై హైప్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. ఈ మూవీ అఫీషియల్ టీజర్‌ను రేపు గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒరిజినల్ సిరీస్ దర్శకుడు గుర్మీత్ సింగ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. కేవలం హిందీకే పరిమితం కాకుండా ఈ సినిమాను తెలుగు భాషలో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. అన్ని హంగులు అద్దుకుని సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. డిజిటల్ స్క్రీన్‌లపై సంచలనం సృష్టించిన ఈ మాస్ డ్రామా, థియేటర్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి!

Keerthi