Find Articles

జాన్వీ-శ్రీలీల మల్టీస్టారర్.. బాక్సాఫీస్ వద్ద క్రేజీ ప్రయోగం!

గ్లోబల్ స్థాయిలో ఎంతటి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ, సరైన సోలో హిట్ లేక సతమతమవుతున్న ఇద్దరు భామలు జాన్వీ కపూర్, శ్రీలీల. ‘పెద్ది’ చిత్రంలో తన పాత్ర శైలిపై వచ్చిన విమర్శలతో జాన్వీ నిరాశలో ఉండగా, శ్రీలీలకు వరుస ప్లాప్‌ల మధ్య ‘భగవంత్ కేసరి’ తప్ప మరో చెప్పుకోదగ్గ విజయం లభించలేదు. అయితే, ఈ ఇద్దరు గ్లామర్ క్వీన్స్ ఇప్పుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపించేందుకు సిద్ధమవుతుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఏక్తా కపూర్, గునీత్ మోంగా కాంబోలో క్రైమ్ థ్రిల్లర్!

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతలు ఏక్తా కపూర్, గునీత్ మోంగా కపూర్ సంయుక్తంగా ఒక హై-వోల్టేజ్ క్రైమ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్‌ను ప్లాన్ చేస్తున్నారు. ‘పగలైట్’ ఫేమ్ ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇద్దరు యువతులు ఒకే అబ్బాయిపై పెంచుకునే తీవ్రమైన ప్రేమాభిమానాలు, అబ్సెషన్ (Obsession) చుట్టూ ఈ కథ తిరగనుందని, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా ఇద్దరి నటనకూ పెద్ద పరీక్ష కానుందని తెలుస్తోంది.

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. జాన్వీకి అత్యంత కీలకం!

చాలా కాలంగా బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీలకు ఈ ప్రాజెక్ట్ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుండగా, ప్రస్తుతం ‘లగ్ లగ్ గలే’ చిత్రంలో నటిస్తున్న జాన్వీ కపూర్ కెరీర్‌కూ ఇది అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌గా మారనుంది.

ప్రస్తుతం ప్రైవేట్ ఈవెంట్లకే పరిమితమైన శ్రీలీల, సరైన కథలను ఎంచుకోవడానికే సమయం తీసుకుంటోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న ఈ ఇద్దరు భామల క్రేజీ ప్రయోగం బాక్సాఫీస్ వద్ద ఏ మేర వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి.

Keerthi