సినిమా ఇండస్ట్రీలో వయసు పైబడే కొద్దీ కుర్రతనాన్ని, గ్లామర్‌ను కాపాడుకోవడానికి నటీనటులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. కానీ వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ (R Madhavan) మాత్రం ఈ విషయంలో పూర్తి భిన్నమైన బాటలో పయనిస్తున్నారు. వయసు పెరగడాన్ని, తలపై తెల్లబడిన జుట్టును తాను ఎంతో గర్వంగా, ఆనందంగా ఆస్వాదిస్తానని ఆయన స్పష్టం చేశారు.
రజనీకాంత్, అజిత్‌లే నాకు స్ఫూర్తి!
తెర వెనుక ఎప్పుడూ సహజంగా ఉండటానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన మాధవన్, తన నిజాయితీని చాటుకున్నారు. “నాకు అబద్ధాలు చెప్పడం రాదు. తెల్ల జుట్టును దాచుకోవడం అసలే నచ్చదు. సినిమాల్లో ఇచ్చే పాత్రల కోసం అవసరమైతే తప్ప, నిజ జీవితంలో జుట్టుకు రంగు (డై) వేసుకోను. ఈ విషయాన్ని నేను సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని చూసే నేర్చుకున్నాను. ఆయన ఆఫ్‌స్క్రీన్‌లో చాలా సాధారణంగా ఉంటారు, కానీ స్క్రీన్‌పై మాత్రం సరికొత్త మ్యాజిక్ చేస్తారు. నా మంచి మిత్రుడు అజిత్ కుమార్ ఆలోచన కూడా ఇదే” అని మాధవన్ చెప్పారు.
పోటీ నాలోని నటుడితోనే!
ప్రస్తుతం తన కెరీర్ చాలా ప్రశాంతంగా సాగుతోందని తెలిపిన ఆయన, చిన్నవాడిగా కనిపించాలనే ఆర్టిఫిషియల్ తాపత్రయం తనకు లేదన్నారు. ఇండస్ట్రీలో ఇతర హీరోలతో తాను ఎలాంటి పోటీలో లేనని, కేవలం నాలోని నటనను మరింత మెరుగుపరుచుకోవడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు. నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా ఇష్టపడతానని ఆయన వ్యాఖ్యానించారు.
‘జి.డి. నాయుడు’ బయోపిక్‌తో మెరుపులు!
వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే మాధవన్, తాజాగా భారతీయ ఎడిసన్‌గా ప్రసిద్ధి చెందిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (జి.డి. నాయుడు) బయోపిక్‌లో నటించారు. కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాధవన్ తన అద్భుత నటనతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు.