Find Articles

సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు రిటర్న్.. డైరెక్టర్ సంచలన ఆఫర్!

హాస్యకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. గంగ సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్లపై రూపొందింది. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న సందర్భంగా, హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు.

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్!
ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు గంగ సప్తశిఖర మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా సినిమా ఆద్యంతం మిమ్మల్ని నవ్విస్తుంది. ఒకవేళ సినిమా నచ్చకపోతే రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి మీ టికెట్‌ను పంపించండి, మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాం” అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ చిత్రంలో ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాల తరహాలో ఫ్రేమ్ నిండా 50 మందికి పైగా నటీనటులు కనిపిస్తారని, రాజేంద్రప్రసాద్ గారు పాటలు, ఫైట్స్‌తో అదరగొట్టారని తెలిపారు.

నా ముప్పై ఏళ్ల కెరీర్‌కు ఆయనే కారణం: పృథ్వీ
చిత్రంలో కీలక పాత్ర పోషించిన ‘థర్టీ ఇయర్స్’ పృథ్వీ మాట్లాడుతూ.. రాజేంద్రప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. “రాజేంద్రప్రసాద్ గారి ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంతోనే నా కెరీర్ ప్రారంభమైంది. ఆయన సపోర్ట్ లేకపోతే నాకీ 30 ఏళ్ల ప్రయాణం ఉండేది కాదు. ఈ సినిమాలో ఆయనతో కలిసి మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. దర్శకుడు గంగ, ఈవీవీ గారి లేని లోటును పూడ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు” అని కొనియాడారు.

తక్కువ టైమ్‌లోనే అదిరిపోయే మ్యూజిక్!
సంగీత దర్శకుడు మహేశ్ నారాయణ మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్ గారి సూచనతో సినిమాలో ఒక స్పెషల్ ‘కవ్వాలీ’ సాంగ్‌ను చేర్చామని, ప్రయోగాత్మకంగా చేసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. యూట్యూబ్ స్టార్ కుమారి ఆంటీ, నటుడు బాల, నటి సునీత తదితరులు మాట్లాడుతూ ఈ సినిమా ప్రేక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Keerthi