మెగాస్టార్ చిరంజీవి చేతికి మైక్ దొరికితే చాలు.. అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అభిమానులకు ఏదో ఒక సర్ప్రైజ్ లీక్ ఇవ్వడం ఆయనకు అలవాటే! తాజాగా వరుణ్ తేజ్, రితికా నాయక్ కాంబినేషన్లో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘కొరియన్ కనకరాజు’ మూవీ విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి, తన రాబోయే ప్రాజెక్ట్ (#Chiru158)కి సంబంధించిన బిగ్ అప్డేట్ను బయటపెట్టేశారు.
తమన్ వారించినా ఆగని మెగాస్టార్!
బాబీ దర్శకత్వంలో చేయబోయే తన 158వ సినిమా టైటిల్‌ను స్టేజ్‌పైనే చెప్పేయమంటారా? అంటూ చిరంజీవి ఫ్యాన్స్‌ను సరదాగా అడిగారు. పక్కనే ఉన్న సంగీత దర్శకుడు తమన్ నవ్వుతూ వద్దని వారించినా, కనీసం హింట్ అయినా ఇవ్వనివ్వమని చిరు మళ్లీ అడిగారు. చివరికి తమన్ ఒప్పుకోకపోవడంతో.. “ఇదైనా చెప్పకుండా నన్ను అడ్డుకోలేవు” అంటూ తన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా టీజర్ రాబోతోంది అని లీక్ ఇచ్చి అభిమానులను ఖుషీ చేశారు.
నటుడిగా వరుణ్ తేజ్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు!
ఈ వేడుకలో వరుణ్ తేజ్ నటనను చిరంజీవి ఆకాశానికెత్తేశారు. “కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోవచ్చు, కానీ నటుడిగా వరుణ్ ఎప్పుడూ విఫలం కాలేదు. సేఫ్ జోన్లో ఉండకుండా ముకుంద, కంచె, అంతరిక్షం లాంటి వైవిధ్యమైన కథలను ఎంచుకున్నాడు. ఈ సినిమా విజయాన్ని వరుణ్ కొడుకు ‘వాయువ్ తేజ్’ ఖాతాలో వేయాలి. అలాగే కాంక్రెట్ లాంటి కామెడీతో సినిమాను నిలబెట్టిన సత్య, అందంతో రంగులు వేసిన రితికా నాయక్ ల పాత్రలు అద్భుతం. మేర్లపాక గాంధీ తక్కువ బడ్జెట్, తక్కువ రోజుల్లో ఈ సినిమాను తీసి నిర్మాతలు మెచ్చేలా చేశారు” అని కొనియాడారు.
సరైన హిట్ వచ్చి ఏడేళ్లయింది: వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ మాట్లాడుతూ, “నాకు సరైన విజయం దక్కి ఏడేళ్లయింది. ఎన్నిసార్లు కిందపడ్డా ముందుకు సాగాలనే పెదనాన్న మాటలే నాకు స్ఫూర్తి. ఆయన, నాన్న, బాబాయ్, అన్న రామ్ చరణ్, మెగా ఫ్యాన్స్ కళ్లలో ఆనందం చూడటానికే కష్టపడుతుంటాను” అని భావోద్వేగానికి గురయ్యారు. కాగా, అన్నయ్య చిరంజీవి తమ కుటుంబానికి ప్రాణవాయువు లాంటి వారని నాగబాబు పేర్కొన్నారు.