తెలుగు చిత్ర పరిశ్రమలో కథల సరళి మారుతోంది. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ సినిమాలకే పరిమితమైన దర్శకులు ఇప్పుడు దైవత్వం, పురాణాల నేపథ్యం వైపు అడుగులు వేస్తున్నారు. వెండితెరపై ఇప్పుడు డివోషనల్ కంటెంట్ కు క్రేజ్ ఏర్పడింది. బాక్సాఫీస్ వద్ద కూడా డివోషనల్ కంటెంట్ సినిమాలు వసూళ్లు వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ వసూళ్లు చూసుకుంటే.. ఇదే నిజమని తెలుస్తోంది. కృష్ణుడి తత్వాన్ని ఆధునిక కోణంలో చిత్రీకరించి… నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా నార్త్ ప్రేక్షుకులు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక కామన్ మ్యాన్ కు హనుమాన్ శక్తి తోడైతే ఎలా ఉంటుందో చూపించిన చిత్రం హను-మాన్. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు సాధించి అందరినీ ఆకట్టుకుంది.
ప్రకృతిని, దైవాన్ని ముడిపెడుతూ వచ్చిన కన్నడ చిత్రం కాంతార తెలుగుతో పాటు… అన్ని భాషల్లో సంచలనం సృష్టించింది. వరుస దేవుళ్ల చిత్రాలు హిట్ అవుతుండటంతో టాప్ హీరోస్ కూడా పురాణ గాథల వైపు మొగ్గు చూపుతున్నారు. విష్ణుమూర్తి అవతారం చుట్టూ తిరిగే కథాంశంతో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 AD భారతీయ సినిమా స్థాయిని మరోసారి పెంచింది. ఇక సూపర్ హిట్టుగా నిలిచిన హనుమాన్ కు జై హనుమాన్ సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఇవే కాకుండా నాగ బంధం, కామాఖ్య సహా ఎన్టీఆర్ తో కార్తికేయుడి సబ్జెక్ట్ వంటి దైవ అంశాలతో కూడిన చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుత యువతరం భారతీయ మూలాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతోంది. భారత సంస్కృతిని, పురాణాల్లోని గొప్పతనానికి VFX జోడించి చూపిస్తుండటంతో ఇలాంటి సినిమాలకు వసూళ్లతో పాటు క్రేజ్ ఏర్పడుతోంది.