Find Articles

తెలంగాణ పథకాలను కాపీ కొట్టిన విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జోసెఫ్ విజయ్ తనదైన శైలిలో సంచలన నిర్ణయాలతో విపక్షాలకు షాక్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలనను పరుగులు పెట్టించేందుకు సిద్ధం అయ్యారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సచివాలయానికి చేరుకున్న విజయ్… నేరుగా మూడు కీలక ఫైల్స్ పై సంతకాలు చేశారు. అందులో ప్రధానంగా సామాన్యులకు ఊరటనిచ్చేలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ తొలి సంతకం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు విద్యుత్ భారంతో విముక్తి లభించనుంది.

కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా, సమాజంలో పేరుకుపోయిన రుగ్మతలను రూపుమాపేందుకు విజయ్ గట్టి చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్రంలో యువతను పట్టి పీడిస్తున్న మాదకద్రవ్యాల ముఠాల అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు ‘యాంటీ డ్రగ్ స్పెషల్ టీమ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, వారి రక్షణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించుతున్నట్లు సీఎం వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు మరింత రక్షణ కల్పించడమే ఈ బృందాల ప్రధాన బాధ్యత అని విజయ్ పేర్కొన్నారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ  నిర్ణయాలతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రిగా తన తొలి అడుగులోనే అటు సంక్షేమాన్ని, ఇటు సామాజిక భద్రతను మేళవించి విజయ్ తన పట్టును నిరూపించుకున్నారు.

అయితే ఈ పథకాలు ఇప్పటికే తెలంగాణలో అమలు అవుతున్నాయి. గృహజ్యోతి పేరుతో తెలంగాణలో 200 యూనిట్ల వరకు అర్హులకు ఉచితంగా కరెంటు అందిస్తున్నారు. అలాగే డ్రగ్స్, మహిళా భద్రతకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు  చేపడుతుంది. వీటినే విజయ్ చిన్న చిన్న మార్పులు చేసి తమిళనాడులో అమలు చేసేందుకు రెడీ అయ్యాడు. దీంతో తెలంగాణ పథకాలను విజయ్ కాపీ కొట్టాడంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Keerthi