తమిళ చిత్ర పరిశ్రమలో ‘దళపతి’గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్, ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. వెండితెరపై ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ హీరో, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఆయనకు అందే జీతం ఎంత అనే విషయంపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సినిమాల్లో ఉన్నప్పుడు విజయ్ ఆదాయం ఆకాశాన్ని తాకేది. కానీ, ప్రజా సేవకుడిగా మారిన తర్వాత ఆయన కేవలం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వేతనాన్ని అందుకోనున్నారు. తాజా లెక్కల ప్రకారం విజయ్ ముఖ్యమంత్రి హోదాలో నెలకు రూ.2,05,000 శాలరీని తీసుకోనున్నారు. వివిధ రకాల అధికారిక అలవెన్సులను పరిగణనలోకి తీసుకుంటే, మొత్తం కలిపి నెలకు సుమారు రూ.2,85,000 వరకు ఆయనకు అందుతుంది. ఈ లెక్కన ఏడాదికి ఆయన మొత్తం వేతనం సుమారు రూ.34.2 లక్షలుగా ఉండబోతోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతాలతో పోలిస్తే విజయ్ శాలరీ కొంత తక్కువగానే కనిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి నెలకు సుమారు రూ.4.1 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.3.35 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. అయితే, జీతం తక్కువైనా దళపతికి ప్రభుత్వం నుంచి దక్కే ఇతర సదుపాయాలు మాత్రం భారీగానే ఉన్నాయి. జీతంతో పాటు ముఖ్యమంత్రిగా విజయ్ భద్రతను, సదుపాయాలను పొందనున్నారు. Z+ సెక్యూరిటీ, అధికారిక కార్యకలాపాల కోసం విశాలమైన క్యాంప్ ఆఫీస్ సదుపాయం ఉంటుంది. ప్రభుత్వ వాహనాలు, అధికారిక విదేశీ పర్యటనలు వంటి ఇతర రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగమే.
కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని, ప్రజా సేవ కోసం లక్షల రూపాయల జీతానికి పరిమితమైన విజయ్ నిర్ణయం ఇప్పుడు అటు అభిమానుల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన సినిమాల్లో లాగే రియల్ లైఫ్‌లోనూ ఈ ‘తలైవా’ సరికొత్త మార్పును తీసుకొస్తారని అంతా ఆశిస్తున్నారు.