వరుస విజయాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి కథానాయకుడిగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్కు ‘ఇడుపు కాయితం’ అనే విభిన్నమైన టైటిల్‌ను ఖరారు చేశారు. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది.
తెలంగాణ నేపథ్యంలో భార్యాభర్తల కథ!
చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ సినిమా పూర్తి తెలంగాణ నేపథ్య కథాంశంతో సాగనుంది. భార్యాభర్తల మధ్య ఉండే అందమైన అనుబంధం, వారి జీవితంలో చోటు చేసుకునే వినోదభరితమైన, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. వంశీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ జానపద నృత్యకారిణి నాగదుర్గ హీరోయిన్గా వెండితెరకు పరిచయం కానుండటం విశేషం.
కథలోని వైవిధ్యం, పాత్రల నైజానికి అద్దం పట్టేలా ఉంటుందనే ఉద్దేశంతోనే చిత్ర బృందం ‘ఇడుపు కాయితం’ అనే వైవిధ్యమైన టైటిల్‌ను లాక్ చేసింది. సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రియదర్శి హీరోగా రావడం, దానికి తోడు లెక్కల మాస్టర్ సుకుమార్ ఆలోచనలు, బన్నీ వాసు నిర్మాణ విలువలు తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ వర్గాల్లో అప్పుడే మంచి అంచనాలు మొదలయ్యాయి. నేడు జరిగిన పూజా కార్యక్రమాల్లో సినీ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలియజేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలను, ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ అధికారికంగా వెల్లడించనున్నారు.