బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో ఈ చిత్రాన్ని గ్లోబల్ స్థాయిలో అత్యంత భారీగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
హాలీవుడ్ దిగ్గజం ‘అవతార్ 2’ రికార్డు సైతం గాల్లోకే!
ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 59,000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతుండటం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్లాన్ కనుక పట్టాలెక్కితే, 2022లో హాలీవుడ్ సంచలనం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ సాధించిన 52,000 స్క్రీన్ల రికార్డును ‘రామాయణ’ అధిగమించనుంది. ప్రపంచంలోనే అత్యధిక థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా ఇండియన్ ‘రామాయణ’ రికార్డు పుస్తకాలకెక్కనుంది.
దేశదేశాల్లో ‘రామాయణ’ ప్రదర్శన!
భారత దేశంలో దాదాపు 9,000 స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. ఇక విదేశాల్లో ఏకంగా 50,000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారతీయ సంస్కృతి, పురాణాల గొప్పతనాన్ని ప్రపంచ నలుమూలలకూ చాటిచెప్పేలా మేకర్స్ ఈ స్థాయి భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తుండటంతో, అభిమానులతో పాటు అంతర్జాతీయ సినీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.