Find Articles

అనుపమ కామెంట్స్‎పై విక్రమ్ కొడుకు ధ్రువ్ సంచలన కామెంట్స్

తమిళ నటుడు, చియాన్ విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) తన వ్యక్తిగత జీవితంపై నెట్టింట జరుగుతున్న ప్రచారం, వస్తున్న తీవ్ర విమర్శలపై ఎట్టకేలకు నోరు విప్పారు. ఇటీవల కథానాయిక అనుపమ పరమేశ్వరన్ చేసిన షాకింగ్ కామెంట్స్ తర్వాత తనపై ముమ్మరంగా వస్తున్న వార్తలపై ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.

ఆ కష్టకాలంలో మా అమ్మే ధైర్యం!

ఇంటర్వ్యూలో అనుపమ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, బ్రేకప్ తర్వాతి పరిణామాలపై ధ్రువ్ మాట్లాడారు. “బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలం నన్ను వ్యక్తిగతంగా తీవ్రంగా ప్రభావితం చేసింది. కానీ నా కుటుంబం, అభిమానులు ఇచ్చిన కొండంత ధైర్యంతోనే నేను ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడగలిగాను. ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడే మన పర్సనల్ లైఫ్‌పై అందరి దృష్టి ఉంటుందని నాకు తెలుసు. ఆ సమయంలో మా అమ్మ నాకు నిరంతరం సపోర్ట్‌గా నిలిచింది” అని తెలిపారు.

మన నడవడిక నిజాయితీగా ఉంటే భయపడక్కర్లేదు!

ఈ ప్రతికూల ప్రచారం తనపై ప్రభావం చూపలేదని చెప్పలేనని ధ్రువ్ అంగీకరించారు. “ఇలాంటి సమయంలో మనమేంటో, దేనికోసం నిలబడ్డామో తెలుసుకోవడం ముఖ్యం. మనకు నచ్చిన వారిని కాపాడుకోవాలి. మన ప్రవర్తన నిజాయతీగా ఉన్నంత కాలం ఎలాంటి విమర్శలూ మనల్ని ఏమీ చేయలేవు” అని ధీమా వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని, సినిమాలు లేదా ప్రమోషన్స్ ఉన్నప్పుడే యాక్టివ్‌గా ఉంటానని, మిగతా సమయంలో పుస్తకాలు చదవడం, వీడియో ఎడిటింగ్, సంగీతం వినడంలో సమయం గడుపుతానని వెల్లడించారు.

అసలు వివాదం ఏమిటంటే?

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. గతంలో రెండేళ్ల పాటు ఒక వ్యక్తితో రిలేషన్‌లో ఉండి తీవ్ర మానసిక, శారీరక వేధింపులకు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యక్తి పేరును ఆమె బయటపెట్టకపోయినా, గతంలో వారిద్దరూ కలసి దిగిన ఫోటోలు, ‘బైసన్’ సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో వచ్చిన రూమర్ల ఆధారంగా నెటిజన్లు ధ్రువ్ విక్రమ్ పేరును వైరల్ చేశారు. ఈ నేపథ్యంలో ధ్రువ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Keerthi