Find Articles

‘ఇరుముడి’లో రామ్ చరణ్ రోల్ పై క్లారిటీ ఇచ్చిన టీమ్!

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ఇరుముడి’. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఈ నెల 21న గ్రాండ్‌గా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ అతిథి పాత్రలో కనిపిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు విపరీతంగా చక్కర్లు కొట్టాయి.

అయ్యప్ప పాటలో రామ్ చరణ్ స్పెషల్ రోల్?

తాజాగా నిర్వహించిన ‘ఇరుముడి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘మల్లెపూల పల్లకి బంగారు పల్లకి’ అంటూ సాగే అయ్యప్ప స్వామి భక్తి గీతాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పాటలో ప్రేక్షకులకు ఒక ఊహించని అదిరిపోయే సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో ప్రచారం మరింత ముదిరింది. చరణ్ అయ్యప్ప మాలధారణలోనే ఈ పాటలో కనిపించనున్నారంటూ రకరకాల పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి.

రూమర్లకు చెక్ పెట్టిన రామ్ చరణ్ టీమ్!

ఈ ప్రచారం క్షణాల్లో వైరల్ కావడంతో వెంటనే రామ్ చరణ్ పిఆర్ టీమ్ దీనిపై అధికారికంగా స్పందించింది. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని స్పష్టం చేస్తూ సంచలన ప్రచారానికి చెక్ పెట్టింది. ‘ఇరుముడి’ సినిమాలో చరణ్ నటించడం లేదని తేల్చిచెబుతూ, అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రేక్షకులను విజ్ఞప్తి చేసింది.

కథలో అసలైన సంఘర్షణ అదే!

ఒక వ్యక్తి అయ్యప్ప దీక్ష తీసుకున్న 41 రోజుల కాలంలో అతని జీవితంలో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయనే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. “అనేక రకాల వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి పరిస్థితుల ప్రభావంతో ఈ మాలధారణ చేయాల్సి వస్తే.. అతడు మద్యంతో పాటు తన అలవాట్లకు దూరంగా ఉండటానికి ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ చిత్రంలో ప్రధాన సంఘర్షణ” అని దర్శకుడు శివ నిర్వాణ ఇటీవల వివరించారు. భక్తి, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Keerthi