బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా రూ.181 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, చరణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. ఈ విజయానందంలో ఉన్న చరణ్, తన తదుపరి ప్రయాణం, బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. గతంలో అపూర్వ లఖియా దర్శకత్వంలో వచ్చిన ‘జంజీర్’ చిత్రం ద్వారా రామ్ చరణ్ బాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ‘కిసి కా భాయ్ కిసి కి జాన్’లో ఒక చిన్న అతిథి పాత్రలో మెరిసినా, మళ్లీ పూర్తిస్థాయి హిందీ సినిమా చేయలేదు. అయితే, అభిమానులు మాత్రం ఆయన మళ్లీ బాలీవుడ్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీనిపై స్పందించిన రామ్ చరణ్ తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు. “సినిమాను హిందీ, తెలుగు అని విభజించి చూడటం నాకు నచ్చదు. నేను చేసే ప్రతి సినిమాను ఒక ‘ఇండియన్ మూవీ’గానే పరిగణిస్తాను. నా దృష్టిలో భాషతో సంబంధం లేదు. బాలీవుడ్, బెంగాలీ, తమిళ్.. ఇలా ఏ ప్రాంతానికి చెందిన దర్శకుడైనా సరే, కథ నచ్చితే పనిచేయడానికి నేను సిద్ధమే. అన్ని భాషల నటులు, దర్శకులతో కలిసి పనిచేయాలని నాకు ఉంది” అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా క్రీడా నేపథ్యంతో కూడిన యాక్షన్ డ్రామా కావడంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సక్సెస్‌తో చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. భాషా పరిమితులు లేని కథలకే రామ్ చరణ్ ప్రాధాన్యత ఇస్తుండటంతో, భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని వైవిధ్యమైన ఇండియన్ సినిమాలు రావడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, ప్రాంతీయ ముద్రలను చెరిపేసి ‘ఇండియన్ సినిమా’ అని గర్వంగా చెప్పుకునే చరణ్ ఆలోచనా విధానం, ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. రాబోయే రోజుల్లో ఆయన ఏ బాలీవుడ్ దర్శకుడితో ప్రాజెక్టును ఖరారు చేస్తారో చూడాలి!