Find Articles

నాగబాబుకు ప్రకాశ్‌రాజ్ కౌంటర్!

సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్‌లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్‌ కల్యాణ్ నాయకత్వాన్ని ఉద్దేశిస్తూ నాగబాబు చేసిన ‘బ్లైండ్ ఫాలోయింగ్’ కామెంట్లకు ప్రకాశ్‌రాజ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది. సమాజంలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యమో వివరిస్తూ నాగబాబు తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ ఫోటోను జత చేస్తూ, “నాయకుడి మాటే శాసనం. ఆ నాయకుడు ప్రయాణించే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు, కష్టాలు ఎవరికీ తెలియవు. ఏది ఒప్పో, ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ సందేహాలను పక్కన పెట్టండి, ఎలాంటి ప్రశ్నలు అడగకుండా కేవలం మీ నాయకుడిని గుడ్డిగా అనుసరించండి” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్‌రాజ్ చాలా ఘాటుగా స్పందించారు. నాగబాబు ట్వీట్‌ను ఉద్దేశిస్తూ ఆయన తనదైన శైలిలో నిలదీశారు. “మీ సందేహాలను పక్కన పెట్టండి, నోరు మూయండి, ఏ ప్రశ్నలూ వేయకుండా నాయకుడిని అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? బానిస బ్రతుకు బ్రతకడానికి మేమేమీ గొర్రెలం కాదు. ఇలాంటి బెదిరింపులు మా దగ్గర వద్దు” అని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. ప్రశ్నించడం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని, ఏ నాయకుడైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని ఆయన గుర్తు చేశారు. “ఏది తప్పు, ఏది ఒప్పు అనేది నాయకుడికి మాత్రమే తెలుస్తుందనడం ఏ రకమైన ప్రజాస్వామ్యం?” అని ఆయన పరోక్షంగా ప్రశ్నించారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వార్ సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ ప్రకాశ్‌రాజ్ అన్నట్లుగా మారిపోయింది. గతంలో ప్రకాశ్‌రాజ్‌కు మెగా కుటుంబం మద్దతుగా నిలిచినప్పటికీ, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తలెత్తడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదంపై నాగబాబు లేదా మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.

Keerthi