దక్షిణాది వెండితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగిన సిమ్రాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఉత్తరాది చిత్ర పరిశ్రమ (బాలీవుడ్) దక్షిణాది నటీనటులను చూసే విధానంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం రెమ్యూనరేషన్ విషయంలోనే కాకుండా, కనీస మర్యాద ఇవ్వడంలో కూడా బాలీవుడ్ విఫలమవుతోందని ఆమె బాంబు పేల్చారు.
చాలా కాలంగా సిమ్రాన్ బాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీనికి గల కారణాలను వివరిస్తూ ఆమె మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టారు. “నేను చాలా హిందీ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేశాను. దానికి ప్రధాన కారణం అక్కడ నాకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడమే. మేము సౌత్‌లో దశాబ్దాలుగా కష్టపడి సంపాదించుకున్న గుర్తింపును, మాకున్న లెగసీని వారు కనీసం పట్టించుకోరు. అసలు మేము ఏ స్థాయి నటులమో కూడా వాళ్లకు అవగాహన ఉండదు. నా జీవితంలో సగానికి పైగా సినిమాకే అంకితం చేశాను. ఇంత అనుభవం ఉన్నా అక్కడ మర్యాద దక్కనప్పుడు ఆ పని చేయడం అనవసరం అనిపిస్తుంది.”
ఒక సీనియర్ నటి అని కూడా చూడకుండా ప్రొడక్షన్ కంపెనీలు వ్యవహరించే తీరుపై సిమ్రాన్ విస్మయం వ్యక్తం చేశారు. ఒక స్టార్ హోదాలో వచ్చే నటీనటులకు కనీస సౌకర్యాల విషయంలో కూడా బాలీవుడ్ మేకర్స్ ‘బేరసారాలు’ ఆడుతారని ఆమె ఆరోపించారు.”నీతో పాటు ఇంతమంది స్టాఫ్ అవసరమా? అంతమందిని తీసుకురావొద్దు” అంటూ నిబంధనలు పెడతారట. ఫ్లైట్ టికెట్ల విషయంలో కూడా లెక్కలు చూస్తారని ఆమె పేర్కొన్నారు. స్టే చేసే హోటళ్ల విషయంలో కూడా బేరాలు ఆడటం తమను అవమానించడమేనని ఆమె అన్నారు.