టాలీవుడ్ బడా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు జడ్జిమెంట్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు, కథల ఎంపికలో ఆయనకు మంచి పట్టు ఉందనే పేరుంది. కానీ, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయన వేసిన తాజా అంచనాలు మాత్రం పూర్తిగా తలకిందులయ్యాయి, వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టి ఆయనకు కోలుకోలేని భారీ షాక్ ఇచ్చాయి. అవే బైకర్, గాయపడ్డ సింహం. ముందు ‘బైకర్’ సినిమా విషయానికి వస్తే.. విడుదలకు ముందు ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. రిలీజ్ తర్వాత కూడా సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. అయితే, మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల ప్రవాహం మాత్రం కనిపించలేదు. కలెక్షన్స్ రాబట్టడంలో ఈ సినిమా దారుణంగా చతికిలపడింది. టాక్ బాగున్నా.. టికెట్ కౌంటర్ల దగ్గర సందడి లేకపోవడం డిస్ట్రిబ్యూటర్గా దిల్ రాజుకు తీవ్ర నిరాశను మిగిల్చింది.
బైకర్ ఇచ్చిన షాక్ నుండి కోలుకోకముందే దిల్ రాజుకు అసలైన డబుల్ జలక్ ఇచ్చింది మాత్రం ‘గాయపడ్డ సింహం’, ఎందుకంటే ఈ సినిమా పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. ఈ సినిమాను ప్రేక్షకులు ఏమాత్రం ఆదరించలేదు, మొదటి ఆట నుంచే పూర్తిగా తిరస్కరించారు. కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే.. థియేటర్లలో కనీస డిజిటల్ ఖర్చులు (క్యూబ్ రెంట్స్) కూడా రికవరీ చేయలేకపోయిందని ట్రేడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి.. డీసెంట్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ రాబట్టలేకపోయిన ‘బైకర్’ ఒకవైపు, అసలు ఏమాత్రం ప్రభావం చూపకుండా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలిన ‘గాయపడ్డ సింహం’ మరోవైపు.. వెరసి డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు ఖాతాలో అనూహ్యమైన పరాజయాలను నమోదు చేశాయి. వరుసగా తగిలిన ఈ డబుల్ ఇంపాక్ట్ నుంచి బయటపడటానికి ఆయన తన తదుపరి సినిమాల పంపిణీ విషయంలో మరింత ఆచితూచి అడుగులు వేయక తప్పని పరిస్థితి నెలకొంది.