Find Articles

హీరోగా దర్శకుడిగా చేయబోతున్న రామ్

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన కెరీర్‌లో ఎవరూ ఊహించని ఒక భారీ మలుపు తీసుకోబోతున్నారు. ఇప్పటివరకు వెండితెరపై తన నటనతో, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించిన రామ్, ఇప్పుడు ‘యాక్షన్’ అనబోతున్నారు. అవును… మీరు విన్నది నిజమే! రామ్ పోతినేని త్వరలో దర్శకుడిగా మెగాఫోన్ పట్టబోతున్నారు. గత కొంతకాలంగా రామ్ ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసుకుని, దాన్ని తెరకెక్కించే సరైన దర్శకుడి కోసం వెతికారు. అయితే తన మనసులో ఉన్న భావాన్ని, ఆ కథలోని ఇంటెన్సిటీని వంద శాతం వెండితెరపై ఆవిష్కరించగల దర్శకుడు దొరక్కపోవడంతో.. చివరకు ఆ బాధ్యతను తన భుజాలకే ఎత్తుకోవాలని రామ్ నిర్ణయించుకున్నారు. తనలోని రచయితకు దర్శకత్వ నైపుణ్యాన్ని జోడించి #RAPO23 ను రూపొందించనున్నారు.

రేపు ఉదయం 10:08 గంటలకు ఈ క్రేజీ అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఇంకా ఎవరినీ ఫైనల్ చేయలేదు. స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

కెమెరా ముందు నటిస్తూనే.. కెమెరా వెనుక నుంచి నిర్దేశించే సత్తా రామ్ సొంతం. ఈ కొత్త ప్రయాణం తెలుగు చిత్రసీమలో సరికొత్త సంచలనానికి తెరలేపనుంది. సాధారణంగా హీరోలు కెరీర్ చివర్లో దర్శకత్వం వైపు వెళ్తుంటారు. కానీ రామ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ‘ఎనర్జిటిక్’ డైరెక్టర్ విజన్ ఎలా ఉండబోతుందో అని అటు అభిమానులు, ఇటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రేపు ఉదయం రాబోయే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం సోషల్ మీడియాలో అప్పుడే సందడి మొదలైపోయింది!

Keerthi