తమిళనాడు సీఎం, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (Jananayagan) ఈ ఏడాది ఆరంభం నుంచే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయని, చిత్రానికి ‘ఏ’ (A) సర్టిఫికెట్ లభించిందని.. అలాగే జులై 23న మూవీ విడుదల కాబోతోందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. దీనికి తోడు కొన్ని కట్స్‌తో కూడిన ఒక సెన్సార్ సర్టిఫికెట్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై ఎట్టకేలకు సదరు నిర్మాణ సంస్థ స్పందిస్తూ అసలు నిజాలను వెల్లడించింది.
ఆ సెన్సార్ రిపోర్ట్ పక్కా ఫేక్: మేకర్స్ క్లారిటీ
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెన్సార్ రిపోర్ట్ పూర్తిగా నకిలీదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. “సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రాన్ని వీక్షించి మాకు కొన్ని చిన్న చిన్న మార్పులు, సవరణలు సూచించారు. ప్రస్తుతం మేము ఆ కట్స్‌కు సంబంధించిన పనుల్లోనే ఉన్నాం. అవి పూర్తయిన వెంటనే మళ్లీ సెన్సార్ సర్టిఫికేషన్ కోసం పంపుతాము. అతి త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం” అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో విజయ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.
లీకైన సినిమాను చూసింది అక్షరాలా 1.20 కోట్ల మంది!
మరోవైపు ‘జన నాయగన్’ మూవీ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ లీకేజీపై చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ (KVN Productions) ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే, అరెస్టయిన నిందితుల్లో కొందరు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు సమర్పించిన వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆన్‌లైన్‌లో లీకైన విజయ్ చివరి చిత్రాన్ని అక్షరాలా 1.20 కోట్ల మంది వీక్షించినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు.
కోర్టు కీలక నిర్ణయం: ఈ కేసులో నిందితులకు ఒకవేళ ఇప్పుడు బెయిల్ మంజూరు చేస్తే, వారు డిజిటల్ ఆధారాలను గల్లంతు చేసే ప్రమాదం ఉందని పోలీసులు గట్టిగా వాదించారు. పోలీసుల వాదనలతో పూర్తిగా ఏకీభవించిన మద్రాస్ హైకోర్టు.. నిందితుల బెయిల్ పిటిషన్లను నిర్మొహమాటంగా తోసిపుచ్చింది.
రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇచ్చే ముందు విజయ్ నటిస్తున్న లాస్ట్ మూవీ కావడం, మరోపక్క లీకేజీ వివాదాలు నడుస్తుండటంతో ఈ ‘జన నాయగన్’ చుట్టూ కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.