అక్కినేని యంగ్ హీరో అఖిల్ తన కెరియర్‌లో ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ పర్వాలేదనిపించినా, ఆ తర్వాత వచ్చిన ‘ఏజెంట్’ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈసారి ఎలాగైనా కొట్టాలనే పట్టుదలతో, కొంత గ్యాప్ తీసుకుని, తండ్రి నాగార్జున ఫైనల్ చేసిన ‘లెనిన్’ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మురళీకృష్ణ అపూర్వ దర్శకత్వంలో నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ క్రేజీ మాస్ యాక్షన్ డ్రామా, ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా అఖిల్‌కు బ్రేక్ ఇచ్చిందా? ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
సినిమా కథేంటంటే:
లెనిన్ (అఖిల్ అక్కినేని) ఒక అనాథ. చిత్తూరు జిల్లాలోని ఒక పల్లెటూరికి చేరుకున్న అతను, అక్కడ జరిగే ఒక జాతర ద్వారా ఆ ఊరిలోని ఒక పెద్ద కుటుంబానికి ఎంతో ఆప్తుడిగా మారతాడు. ఊరి జనాలు అందరికీ తలలో నాలుకలా ఉంటూ అందరి మనసులు గెలుచుకుంటాడు. ఈ క్రమంలోనే భారతి (భాగ్యశ్రీ బోర్సే) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే, లెనిన్‌ను ఆదరించి పెద్ద చేసిన కుటుంబానికి చెందిన వసంత్ అనే యువకుడితో భారతికి పెళ్లి కుదురుతుంది. కానీ, తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను లెనిన్‌ను ప్రేమిస్తున్నానని భారతి స్పష్టం చేయడంతో.. వసంత్ పెద్ద మనసుతో దగ్గరుండి వారిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. అయితే, ఆ తర్వాత కథ ఊహించని మలుపు తిరుగుతుంది. లెనిన్ ఎందుకు జైలుపాలు కావాల్సి వచ్చింది? ఇందులో భారతి పాత్ర ఏంటి? ఎతిరాజులు (శివాజీ) ఎలాంటి రోల్ ప్లే చేశాడు? అనేదే మిగతా సినిమా.
మూవీ విశ్లేషణ:
సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ నటించిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ సినిమా మొదటి నుంచి లీకుల సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడింది. ముఖ్యంగా మేకర్స్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అని భావించిన కొన్ని కీలక సీన్లు ముందే సోషల్ మీడియాలో లీక్ అవ్వడం సినిమాకు మైనస్‌గా మారింది.
సినిమా ప్రారంభం చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఒక అనాథ కుర్రాడు గ్రామానికి రావడం, అక్కడి వారితో కలిసిపోవడం వంటి సీన్లు బాగున్నాయి. ఆ తర్వాత అతను జైలు నుండి బయటకు రావడం, అతని వెనుక జైలర్ అండ్ టీమ్ పడటం వంటి ఎలివేషన్స్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే, కథ ముందుకు సాగుతున్న కొద్దీ కొంత రొటీన్ ఫార్మాట్ ఫీలింగ్ కలుగుతుంది. పాత తెలుగు సినిమాల తరహా కథే అయినప్పటికీ.. దర్శకుడు రాసుకున్న కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్టులు ప్రేక్షకులను సీట్లలో కూర్చోబెడతాయి.
సెకండ్ హాఫ్‌లో వచ్చే ట్విస్టులు బాగున్నప్పటికీ, ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయిన విషయాలే స్క్రీన్ మీద యథాతథంగా కనిపించడం సినిమాలోని ‘షాక్ ఫ్యాక్టర్’ను తగ్గించేసింది. మొన్న ‘పెద్ది’, ఇప్పుడు ‘లెనిన్’.. ఇలా మేకర్స్ దాచాలనుకున్న సర్ప్రైజ్‌లు ముందే వైరల్ అవ్వడం కలవరపరిచే అంశమే. ఓవరాల్‌గా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కంటే కూడా పక్కా మాస్ ఎలిమెంట్స్ ఆశించే వారికి బాగా నచ్చుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్ & టెక్నికల్ టీమ్:
అఖిల్ అక్కినేని ‘లెనిన్’ పాత్రలో జీవించాడనే చెప్పాలి. పూర్తి మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో లీనమై నటించాడు. అయితే, అతని మేకోవర్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరికింది. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా అభినయంతోనూ ఆకట్టుకుంది. వసంత్ పాత్రలో నటించిన కొత్త నటుడు మెప్పించాడు. బ్రహ్మాజీ, శత్రు, శివాజీ, ఈశ్వరి రావు వంటి సీనియర్లు తమ న్యాచురల్ యాక్టింగ్‌తో సినిమాను నిలబెట్టారు.
సాంకేతిక పరంగా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం, ప్రతి యాక్షన్ సీన్‌ను బాగా ఎలివేట్ చేసింది. అయితే పాటలు అంతగా ఆకట్టుకోకపోగా, కథనానికి స్పీడ్ బ్రేకర్లుగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ ఆసక్తిగా సాగినప్పటికీ.. సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సాగతీత సీన్లు ల్యాగ్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఎడిటింగ్ పై కొంచెం కేర్ తీసుకుని నిడివి తగ్గించి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్: అఖిల్ నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, మాస్ ఎలివేషన్స్.
మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, లీక్ అయిన సీన్లు, సెకండ్ హాఫ్ ల్యాగ్, పాటలు.
ఫైనల్ వర్డిక్ట్: కొన్ని ల్యాగ్స్ ఉన్నప్పటికీ.. మాస్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసే అదిరిపోయే ట్విస్టుల ‘లెనిన్’!
రేటింగ్: 2.2/5