Find Articles

అభిమానుల ప్రేమే గాయపరిచింది.. దశాబ్ద కాలంగా పవన్ భరిస్తున్న నొప్పి.. అసలు ఏమైందంటే?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో ఒక కీలకమైన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. గత కొంతకాలంగా ఆయన్ను తీవ్రంగా వేధిస్తున్న భుజాల సమస్యకు సంబంధించి శనివారం ఉదయం వైద్యుల బృందం దాదాపు మూడున్నర గంటల పాటు శ్రమించి ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఆయన రెండు భుజాల ‘రొటేటర్ కఫ్’ (Rotator Cuff) కండరాలు తీవ్రంగా దెబ్బతినడంతో ఈ సర్జరీ అనివార్యమైంది. అయితే, ఒకేసారి రెండు భుజాలకూ ఆపరేషన్ చేస్తే నొప్పి భరించడం కష్టమని భావించిన డాక్టర్లు.. ప్రస్తుతానికి కేవలం కుడి భుజానికి మాత్రమే చికిత్స చేశారు. మరో రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి రెండో సర్జరీ చేయనున్నారు.

అసలు ఈ గాయం వెనుక ఉన్న అసలు కథ ఇదీ..

పవన్ కళ్యాణ్‌ను వేధిస్తున్న ఈ భుజాల నొప్పి ఈనాటిది కాదు.. దీనికి ఒక దశాబ్ద కాలపు హిస్టరీ ఉంది. 2016లోనే ఆయన భుజానికి మొదటిసారి తీవ్రమైన గాయమైంది. ఆ సమయంలోనే నిపుణులైన వైద్యులు పూర్తి విశ్రాంతిని సూచించినప్పటికీ, ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన విశ్రాంతిని పక్కనపెట్టి నిరంతరం రాజకీయ సమావేశాలలో పాల్గొన్నారు. ఆ తర్వాత 2018లో చేపట్టిన ప్రతిష్టాత్మక ‘పోరాట యాత్ర’ సమయంలో ఈ సమస్య మరింత జటిలంగా మారింది. జనసేనానిని చూడటానికి తరలివచ్చిన లక్షలాది మంది అభిమానులు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడితో కరచాలనం చేయడానికి, దగ్గరగా వెళ్లడానికి పోటీ పడేవారు. ఆ ఉత్సాహంలో పవన్ చేతులు పట్టుకుని బలంగా లాగడంతో లోపల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎంత విపరీతమైన నొప్పి వస్తున్నా అభిమానుల ప్రేమని కాదనలేక ఆయన పంటిబిగువున భరించారు తప్ప ఎక్కడా బయటపడలేదు.

తిరగబెట్టిన పాత గాయాలు..

2019 ఎన్నికల అనంతరం రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యల పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. అశేష జనవాహిని మధ్య అభిమానులు ఆయన్ని ఆప్యాయంగా హత్తుకోవడం, చేతులు గుంజడం వల్ల పాత గాయాలు ఒక్కసారిగా తిరగబెట్టాయి. ఆ తర్వాత జరిగిన ‘వారాహి యాత్ర’  ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల సుడిగాలి ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ భీభత్సమైన భుజం నొప్పితోనే రాత్రి పగలు అనకుండా ప్రజల్లో తిరిగారు.

ఆశ్చర్యపోయిన ముంబయి వైద్యులు!

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పవన్ కళ్యాణ్‌కు ముక్కుకు సంబంధించిన ఒక చిన్న శస్త్రచికిత్స జరిగినప్పుడు, సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా భుజాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ సమయంలో రెండు భుజాల రొటేటర్ కఫ్ కండరాలు, మజిల్స్ తీవ్రస్థాయిలో చిట్లిపోయినట్లు (Muscle Tears) చూసి వైద్యులే షాక్ అయ్యారు. ఇంత భయంకరమైన పెయిన్‌ను ఒక మనిషి ఇన్నాళ్లుగా ఎలా భరిస్తూ, అంత యాక్టివ్‌గా ఎలా తిరగగలిగారు అని ముంబయికి చెందిన లీడింగ్ డాక్టర్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సర్జరీ చేసుకోవాలని అప్పుడే హెచ్చరించినప్పటికీ, ముందుగా ఒప్పుకున్న ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలను బాధ్యతగా పూర్తి చేసి, ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబయి ఆసుపత్రిలో నిపుణుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

Keerthi