తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ చివరి చిత్రంగా మొదటి నుంచీ వార్తల్లో నిలుస్తూ వచ్చిన ‘జననాయగన్’.. తెలుగులో ‘జననాయకుడు’ పేరుతో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలైతే ఈ సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కొన్ని సెన్సార్ ఇష్యూస్ వల్ల ఆలస్యమై ఎట్టకేలకు థియేటర్లలోకి అడుగుపెట్టింది. నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’కి ఇది రీమేక్ అనే వార్తలు, అలాగే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు చేసిన ఆఖరి సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో సమీక్షలో చూద్దాం.
కథ ఏమిటంటే?
దళపతి వెట్రి కొండన్ (దళపతి విజయ్) తన ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న అమ్మాయి విజ్జు (మమతా బైజు). ఓ రోజు అనూహ్యంగా విజ్జు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఓ రహస్య ఫైల్ అందించే క్రమంలో శక్తివంతమైన హిమ్లర్ (బాబీ డియోల్) గ్యాంగ్ కంటపడుతుంది. దాంతో ఆమెను అంతమొందించేందుకు ఆ గ్యాంగ్ స్కెచ్ వేస్తుంది. విజ్జుని రక్షించడానికి దళపతి వారికి ఎలా అడ్డుగోడగా నిలిచాడు? అసలు ఆ ఫైల్లో ఏముంది? విజ్జుకి, వెట్రి కొండన్‌కి ఉన్న అనుబంధం ఏమిటి? ఈ కథలోకి కయల్ (పూజా హెగ్డే) ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే వెండితెరపైనే చూడాలి.
కథనం – విశ్లేషణ:
ఇది ‘భగవంత్ కేసరి’ రీమేక్ అని ప్రచారంలోనే క్లారిటీ వచ్చింది. అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో వచ్చిన ఆ సినిమాలోని ‘ఉమెన్ ఎంపవర్మెంట్’ లైన్‌ను దర్శకుడు హెచ్. వినోత్ ఇక్కడ కూడా ప్రధానంగా తీసుకున్నాడు. అయితే తమిళ నేటివిటీకి, ముఖ్యంగా విజయ్ ఇమేజ్, ఆయన పొలిటికల్ మైలేజ్‌కి తగ్గట్లుగా కథలో మార్పులు చేశాడు. మత రాజకీయాలు, రాజకీయ నాయకుల తీరుపై విజయ్‌తో పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పించి ఫ్యాన్స్‌కి కావాల్సిన పొలిటికల్ ప్రచారంలా సినిమాను డిజైన్ చేశారు.
సెకండ్ హాఫ్‌లో ఒరిజినల్ కథకు దూరంగా సరికొత్త కాన్ఫ్లిక్ట్ను రాసుకున్న తీరు బాగుంది. అయితే, ఎక్కువ సబ్‌ప్లాట్స్ చేర్చడం వల్ల నిడివి పెరిగిపోయి కథనం అక్కడక్కడా నెమ్మదించింది. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ చూసిన తెలుగు ప్రేక్షకులకు అక్కడక్కడా సీన్స్ రొటీన్‌గా అనిపించినా, తమిళ ఆడియన్స్‌కి, విజయ్ అభిమానులకు మాత్రం ఇది పక్కా మాస్ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే?
విజయ్ తన వన్‌మేన్ షోతో సినిమాను ముందే ఉండి నడిపించారు. మాస్ యాక్షన్, ఎమోషనల్ సీన్లలో అదరగొట్టారు. మమతా బైజు నటన పర్వాలేదనిపించినా, కొన్ని చోట్ల ఎమోషన్ ఇంకా బాగా పండాల్సింది. పూజా హెగ్డే పాత్ర పరిధి తక్కువే. విలన్‌గా బాబీ డియోల్ మరోసారి తన నటనతో మెప్పించారు, కానీ ఆయన క్యారెక్టర్‌ను ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. హెచ్. వినోత్ కథను అడాప్ట్ చేసుకున్న తీరు బాగుంది. సెకండ్ హాఫ్‌లో ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త జాగ్రత్తపడి ఉంటే అవుట్‌పుట్ ఇంకా బాగా వచ్చేది. డైలాగ్స్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇక అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి అతిపెద్ద ఎస్సెట్. ప్రతీ సన్నివేశాన్ని తన బీజీఎమ్‌తో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పెట్టిన ఖర్చు ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.
ఫైనల్ వర్డిక్ట్:
తెలుగు వారికి పోలికలు తప్పవు కానీ.. విజయ్ ఫ్యాన్స్‌కి మాత్రం ‘జననాయకుడు’ పర్ఫెక్ట్ మాస్ అండ్ పొలిటికల్ ఫీస్ట్!
రేటింగ్: 3/ 5 ⭐️⭐️⭐️