Find Articles

నాన్న విజయ్‌తో ఆ హాలీవుడ్ స్టార్ హీరో.. తలపతి తనయుడి డ్రీమ్ ప్రాజెక్ట్!

తమిళ సూపర్ స్టార్, ‘తలపతి’ విజయ్ తనయుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) తన కెరీర్, లక్ష్యాలు డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకత్వంపై ఆసక్తితో ఇప్పటికే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన, భవిష్యత్తులో హాలీవుడ్ స్థాయిలో ఒక భారీ ప్రాజెక్ట్ చేయాలనే తన కోరికను బయటపెట్టారు.

“పైలట్, క్రికెటర్ కాదా.. ఫిల్మ్ మేకర్!”

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జాసన్ సంజయ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. “చిన్నప్పుడు నాన్నతో కలిసి షూటింగ్ సెట్స్‌కి వెళ్లేవాడిని. అక్కడి వాతావరణం నన్ను ఎంతో ఆకట్టుకునేది. మొదట్లో పైలట్ కావాలని, ఆ తర్వాత క్రికెటర్ అవ్వాలని అనుకున్నాను. కానీ ఇంటర్మీడియట్ కొచ్చేసరికి సినిమాలపై స్పష్టమైన ఆసక్తి ఏర్పడింది. కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత దర్శకుడిగానే నా కెరీర్ నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నాను” అని తెలిపారు.

విజయ్ – జాసన్ స్టాథమ్ కాంబినేషన్!

తన కలల ప్రాజెక్ట్ గురించి చెబుతూ సంజయ్ ఓ బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. “మా నాన్న విజయ్‌ను డైరెక్ట్ చేయడమే నా జీవితంలో అతిపెద్ద కల. ఆయనతో పాటు హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ స్టాథమ్ (Jason Statham) కాంబినేషన్‌లో ఒక హాలీవుడ్ ప్రాజెక్ట్ రూపొందించాలని ఉంది. ఈ మాట వినగానే సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ వస్తాయని నాకు తెలుసు. కానీ వీరిద్దరి కాంబో వెండితెరపై చూస్తే అద్భుతంగా ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కోలీవుడ్‌లో దర్శకుడిగా అడుగులు వేస్తున్న జాసన్ సంజయ్, భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబోను నిజం చేస్తారో లేదో చూడాలి!

Keerthi