తమిళనాడు రాజకీయాలు,సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారంలో హఠాత్తుగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో విజయ్‌పై దాఖలు చేసిన విడాకులు, నివాస హక్కుల పిటిషన్లను సంగీత వెనక్కి తీసుకున్నారు. దీంతో కొద్దిరోజులుగా నడుస్తున్న ఈ హైప్రొఫైల్ చట్టపరమైన పోరాటానికి తెరపడింది.
కోర్టులో అసలేం జరిగింది?
కొంతకాలంగా వ్యక్తిగత విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్న ఈ దంపతుల వ్యవహారంలో, గతేడాది డిసెంబర్లో సంగీత విడాకులు, నివాస హక్కులు కోరుతూ చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించారు. భద్రతా కారణాలు, ప్రాముఖ్యత దృష్ట్యా గతంలో మూడుసార్లు జరిగిన విచారణకు వీరిద్దరినీ వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది.
శుక్రవారం ఈ కేసు విచారణకు రాగా, తమిళనాడు శాసనసభ సమావేశాల్లో పాల్గొంటున్నందున విచారణను వాయిదా వేయాలని విజయ్ తరఫు న్యాయవాది కోరారు. అయితే విచారణను నిర్ణీత సమయానికే జరపాలని సంగీత న్యాయవాదులు ఒత్తిడి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసును మధ్యాహ్నానికి వాయిదా వేసింది.
15 నిమిషాల ప్రకటన.. కేసు క్లోజ్!
మధ్యాహ్నం ప్రారంభమైన విచారణలో భార్య సంగీత ఫ్యామిలీ కోర్టు జడ్జి సుజాత ఎదుట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరై దాదాపు 15 నిమిషాల పాటు తన వాదనలను వినిపించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన అనంతరం, విడాకులు, నివాస హక్కుల పిటిషన్లను ఉపసంహరించుకోవాలనే ఆమె అభ్యర్థనను కోర్టు ఆమోదించింది. దీంతో ఈ కేసును క్లోజ్ చేస్తున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఉపసంహరణ వెనుక ఉన్న అసలు కారణాలపై విజయ్ గానీ, సంగీత గానీ ఇప్పటివరకు ఎలాంటి బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు.
మూడు దశాబ్దాల బంధం!
విజయ్, సంగీతల మధ్య దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. వీరిద్దరూ ఆగస్టు 25, 1999న చెన్నైలో సాంప్రదాయ హిందూ పద్ధతిలో అంతర్మత వివాహం చేసుకున్నారు. వీరికి 2000లో కుమారుడు, 2005లో కుమార్తె జన్మించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ల ఉపసంహరణతో వీరిద్దరి వివాహ బంధంపై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా చెక్ పడినట్లయింది.