Find Articles

నో కట్స్, ఓన్లీ వైలెన్స్: యశ్ ‘టాక్సిక్’ సెన్సార్ రిపోర్ట్ అవుట్

‘కేజీఎఫ్’ సిరీస్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టాక్సిక్’ (Toxic). గ్లోబల్ రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రివేంజ్ డ్రామా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో, ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఒక్క సీన్ కూడా కట్ లేకుండా ‘A’ సర్టిఫికేట్!

సాధారణంగా వైలెన్స్, తీవ్రమైన హింసాత్మక దృశ్యాలు ఉండే సినిమాలపై కఠినంగా వ్యవహరించే సెన్సార్ బోర్డు (CBFC), ‘టాక్సిక్’ చిత్రానికి మాత్రం ఎలాంటి కట్స్ సూచించకుండా క్లియరెన్స్ ఇవ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ‘A’ (Adults Only) సర్టిఫికెట్ జారీ చేసింది. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో రూపొందిన ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 12 నిమిషాలు ఉన్నట్లు సమాచారం. కన్నడ వెర్షన్‌లో కేవలం రెండు పదాలను మ్యూట్ చేయడంతో పాటు పొగతాగడం, మద్యపాన హెచ్చరికల బోర్డులను మాత్రమే యాడ్ చేయాలని బోర్డు ఆదేశించింది.

నెట్టింట జోరుగా చర్చ!

హాలీవుడ్ చిత్రాలైన ‘స్పైడర్ మ్యాన్’, ‘సూపర్ మ్యాన్’ లాంటి సినిమాల్లో చిన్నపాటి ముద్దు సీన్లకే ఆంక్షలు విధించే సెన్సార్ బోర్డు, ఇంతటి పవర్‌ఫుల్ అండ్ వైలెంట్ యాక్షన్ మూవీకి ఒక్క సీన్ కూడా ట్రిమ్ చేయకుండా అనుమతి ఇవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గతంలోనే స్పందించిన యశ్, ఇది కేవలం పెద్దల కోసం మాత్రమే ఎంతో నిజాయతీగా తీసిన చిత్రమని, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని స్పష్టం చేశారు.

భారీ తారాగణంతో ఆగస్టు 26న విడుదల!

నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి మోస్ట్ పాపులర్ తారలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ విజువల్ వండర్, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతోంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

Keerthi