Find Articles

నటులు లేకుండా సినిమా: ‘అంబాస్ రివెంజ్’ టీజర్ రచ్చ!

భారతీయ సినీ పరిశ్రమ సాంకేతికతలో మరో సరికొత్త మైలురాయిని అధిగమించింది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై జైవర్ధన్ మేడి దర్శకత్వంలో యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మాతలుగా రూపొందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిత్రం “అంబా’స్ రివెంజ్”. మనుషుల ప్రమేయం లేకుండా కంప్లీట్‌గా AI సాంకేతికతతో మాత్రమే రూపుదిద్దుకున్న ఈ విజువల్ ఫీస్ట్ టీజర్‌ను తాజాగా మీడియా సమక్షంలో అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు.

మహాభారతంలో అంబా ప్రతీకార గాథ!

ఈ సినిమా కథాంశం భారతీయ ఇతిహాసమైన మహాభారతంలోని అంబా ప్రతీకార ఘట్టం ఆధారంగా తెరకెక్కింది. ఒక జన్మలో భీష్ముని వల్ల మరణించిన అంబ, మరుసటి జన్మలో శిఖండిగా జన్మించి భీష్ముడిపై తన పగను ఎలా తీర్చుకుందనే ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూపించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు జైవర్ధన్ మేడి మాట్లాడుతూ.. “సినిమా పేరు అంబ అని ఉన్నప్పటికీ, కథను శిఖండి కోణం నుంచి చూడబోతున్నాం. పాత్రల పరిచయం కోసమే ఈ టీజర్‌ను డైలాగ్స్ లేకుండా విడుదల చేశాం, త్వరలోనే పవర్‌ఫుల్ ట్రైలర్‌తో రాబోతున్నాం” అని తెలిపారు.

AI మూవీ అంటే తక్కువ ఖర్చు కాదు!

సాధారణంగా AI ద్వారా సినిమా తీస్తే ఖర్చు తక్కువ అనుకుంటారని, కానీ నిరంతరం మారుతున్న టూల్స్ వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా వ్యయప్రయాసలతో కూడుకున్నదని నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి పేర్కొన్నారు. రీల్స్‌లో చూసే AI కంటెంట్‌కి, ఈ పూర్తి స్థాయి విజువల్ ఫీస్ట్ సినిమాకి చాలా తేడా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక ఎడిటర్ హ్యారీ బ్రెయిన్, లిరిసిస్ట్ కిషోర్ కుమార్ ఏనుగు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ ఎంసి, విజువల్ డైరెక్టర్ సాయి నేత మాట్లాడుతూ.. నేటి తరానికి సులభంగా అర్థమయ్యేలా రెండు అద్భుతమైన పాటలతో ఈ విజువల్ వండర్‌ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నామని, అందరి ఆదరణ లభిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.

Keerthi