Find Articles

చిన్న సినిమా అని తొక్కేయకండి: హీరో శ్రీరామ్

అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందిన గ్రాండ్ రూరల్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘మా రాముడు అందరివాడు’. శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. యద్దనపూడి మైకిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది.

గ్లామర్ కంటే టాలెంట్ ముఖ్యం: సీనియర్ నటుడు సుమన్
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ.. “ఇండస్ట్రీలో గ్లామర్ కంటే ప్రతిభకే ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. హీరో శ్రీరామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో (డ్యూయెల్ రోల్) అద్భుతంగా నటించారు. నేను ఇందులో ముఖ్యమంత్రిగా ఒక మంచి సామాజిక మెసేజ్ ఉన్న డిఫరెంట్ రోల్ చేశాను. విలన్‌గా నటించిన నిర్మాత లక్ష్మణ్ గారు, సీఎం అయిన నా మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మైకిల్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ట్విస్టులతో సాగే ఈ చిత్రాన్ని ఆదరిస్తే మరింతమంది కొత్తవారు ఇండస్ట్రీకి వస్తారు” అని పేర్కొన్నారు.

హీరో శ్రీరామ్ మాట్లాడుతూ… ఇండస్ట్రీలోని పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “కంటెంట్ ఉన్నప్పుడు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండకూడదు. మన తెలుగు వాళ్లం మనమే ప్రోత్సహించుకోవాలి. ఈ సినిమాలో చాలా దమ్ముంది. సుమన్ గారిలాంటి లెజెండ్‌తో నటించడం నా అదృష్టం. ఇప్పటివరకు 13 సినిమాలు చేసిన నాకు, 100 సినిమాలు చేయాలనేదే లక్ష్యం. ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.

వైల్డ్ విలనిజం విత్ మారెడుమిల్లి విజువల్స్!
నిర్మాత మరియు విలన్ అనుముల లక్ష్మణరావు మాట్లాడుతూ.. “మారెడుమిల్లి ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ చిత్రంలో 20 ఏళ్ల అరాచకపు ఎంపీగా, వైల్డ్ విలన్‌గా నటించాను. తొలుత ఇండస్ట్రీలో పెద్దవారు ఎవరూ సహకరించకపోయినా, ట్రైలర్ చూసి ప్రశంసించారు. మనీష్ కుమార్ మ్యూజిక్, డిఓపి వినోద్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెప్టెంబర్ 4న థియేటర్లకు వస్తున్న మా సినిమాను ఆదరించాలని కోరుతున్నాను” అని తెలిపారు.

తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో ఫుల్ మీల్స్!
దర్శకుడు యుద్ధనపూడి మైకిల్ మాట్లాడుతూ… “14 నెలల సుదీర్ఘ జర్నీలో ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ స్థాయికి వచ్చాం. డైరెక్షన్‌తో పాటు కథ, మాటలు, పాటలు, కొరియోగ్రఫీ కూడా నేనే అందించాను. ఇందులోని ఫాదర్-సన్ ఎమోషన్ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ప్రేక్షకులకి ఇది ఒక పర్ఫెక్ట్ ఫుల్ మీల్స్‌లాంటి సినిమా” అని ధీమా వ్యక్తం చేశారు. కథానాయకి స్వాతి మందాడి, నటులు నాగ మహేష్, సమ్మెట గాంధీ, బాహుబలి ప్రభాకర్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం గ్రాండ్‌గా ముగిసింది.

Keerthi