తన సినీ ప్రయాణం మొదలై 48 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ‘మెగా యూత్ ఫోర్స్’ వేదికపై టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్లో సాధించిన విజయాల వెనుక ఉన్న క్రమశిక్షణ, సమయపాలన గురించి చెబుతూనే, గతంలో తనపై వచ్చిన కొన్ని దారుణమైన నిందలు, ఎదురైన అవమానాలను తలచుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తం అమ్ముకుంటున్నాడన్నారు!’
సమాజ సేవ కోసం తాను ఏర్పాటు చేసిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్‌పై కొందరు చేసిన విమర్శలను గుర్తుచేసుకుంటూ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
“‘బ్లడ్ బ్యాంక్ పెట్టి రక్తాన్ని అమ్ముకుంటున్నాడు’ అని కొందరు చాలా మూర్ఖంగా మాట్లాడారు. నాకొచ్చే రెమ్యునరేషన్‌తో పోలిస్తే, ఎన్ని కోట్ల రక్తం ప్యాకెట్లు అమ్మితే ఆ డబ్బుతో సమానమవుతుంది? నేనెక్కడా రూపాయి విరాళం తీసుకోకుండా, ఎవరి ముందూ చేయి చాపకుండా నా సొంత కష్టార్జితంతో ఈ బ్లడ్ బ్యాంక్ నడుపుతున్నా. ఇందులో నా శ్రమ కంటే ప్రాణదానం చేస్తున్న అభిమానుల సహకారమే ఎక్కువగా ఉంది. ఆ త్యాగానికి వెలకట్టగలమా? కానీ ఇలాంటి అవమానాలను పట్టించుకుంటూ కూర్చుంటే జీవితంలో ముందడుగు వేయలేము.”
అని చిరు స్పష్టం చేశారు. జీవితంలో ఎదురయ్యే విమర్శలను, అవమానాలనే తన ఎదుగుదలకు పునాది రాళ్లుగా మార్చుకున్నానని తెలిపారు.
ఉదయం 4:30 గంటలకే మేల్కొంటా.. క్రమశిక్షణే నా రహస్యం!
ప్రస్తుతం కొల్లి బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ (Kaaka) చిత్రం గురించి చిరంజీవి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాలో తాను ‘కదిరి కాళిదాసు’ అనే విభిన్నమైన పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వయసులో కూడా తాను పాటిస్తున్న క్రమశిక్షణ గురించి చెబుతూ..
“రోజూ తెల్లవారుజామున 4:30 గంటలకే నిద్రలేచి, గంట పాటు వ్యాయామం పూర్తి చేసుకుని ఉదయం 8 గంటలకల్లా కోకాపేట సెట్స్‌లో ఉంటాను. హీరోగా నేను 10 గంటలకు వచ్చినా నన్ను ఎవరూ అడగరు. కానీ నేనే క్రమశిక్షణ, సమయపాలన పాటించకపోతే నా టీమ్ ఎలా పాటిస్తుంది? సమయం అత్యంత విలువైనది, దాన్ని వృథా చేయవద్దు.”
అని అభిమానులకు పిలుపునిచ్చారు.
హీరోల మధ్య శత్రుత్వం లేదు.. అభిమానులూ కలిసి ఉండాలి!
అభిమానుల మధ్య సఖ్యత ఉండాలని కోరిన చిరంజీవి, హీరోలందరూ ఒకరితో ఒకరు చాలా ఆప్యాయంగా, బాగుంటారని గుర్తుచేశారు. ఆ వాతావరణాన్ని మొట్టమొదట ప్రారంభించిందే తానని, హీరోలందరి మధ్య మంచి బంధం ఉందని చెప్పారు. చిరంజీవి అభిమానులంటే అందరూ గర్వపడేలా ఉండాలని, తోటి హీరోల అభిమానులతో కలిసి మెలిసి ఉండాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు.