Find Articles

కేంద్ర మంత్రి కుమారుడు హనీ ట్రాప్‌.. పోక్సో కేసు?

కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చుట్టూ ఒక పెను సంచలనం తిరుగుతోంది. హనీ ట్రాప్, బ్లాక్‌మెయిల్, మైనర్ వేధింపుల ఆరోపణలతో ఈ ఉదంతం హాట్ టాపిక్ అయింది. తనను కొంతకాలంగా ఒక కుటుంబం హనీ ట్రాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తోందని భగీరథ్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని కొంపల్లికి చెందిన ఒక కుటుంబం తన నుంచి రూ. 5 కోట్లు డిమాండ్ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. స్నేహితుల ద్వారా పరిచయమైన సదరు యువతితో కలిసి పార్టీలు, ఫంక్షన్లు, చివరకు గుడులకు కూడా వెళ్లానని.. ఇప్పుడు ఆ సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకుని వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లతో తనను వేధిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇప్పటికే సదరు యువతి తండ్రికి రూ.50,000 చెల్లించానని, కానీ వారు ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు కావాలని ఒత్తిడి తెస్తున్నారని భగీరథ్ ఆరోపించారు.

మరోవైపు… భగీరథ్ ఫిర్యాదు చేసిన కాసేపటికే సదరు యువతి కుటుంబం కూడా పోలీసులను ఆశ్రయించింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ యువతి మైనర్ అని, భగీరథ్ ఆమెను వేధించాడని ఆ కుటుంబం హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది.
ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే, భగీరథ్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి కుమారుడు నిజంగానే హనీ ట్రాప్‌కు గురయ్యారా? లేకుంటే మైనర్ బాలిక పట్ల తప్పుగా ప్రవర్తించి ఇప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ రెండు వెర్షన్లలో ఏది నిజం అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం రెండు వైపుల నుంచి ఆరోపణలు రావడంతో ఈ కేసు అత్యంత కీలకంగా మారింది.

Keerthi