Find Articles

చీటింగ్ కేసులో అషు రెడ్డికి షాక్

టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక NRI ను మోసం చేశారనే ఆరోపణలు ఇప్పుడు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కేసులో దర్యాప్తును నిలిపివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.

అసలేం జరిగిందంటే.. గత కొంతకాలంగా అషురెడ్డి, ఆమె తల్లి యశోదరెడ్డిపై ఒక ఎన్నారై వ్యాపారవేత్త తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వివాహం చేసుకుంటానని నమ్మించి, తనను ఆర్థికంగానూ, మానసికంగానూ వంచించారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నమోదైన కేసుపై విచారణను ఆపాలని, తమపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ అషురెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, అషురెడ్డి అభ్యర్థనలను అంగీకరించేందుకు నిరాకరించింది. కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున, దర్యాప్తును అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ వంటి కఠిన చర్యల నుంచి రక్షణ కల్పించాలన్న ఆమె విన్నపాన్ని కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు.

కోర్టు తాజా నిర్ణయంతో అషురెడ్డికి కష్టాలు మొదలైనట్లే కనిపిస్తోంది. పోలీసుల దర్యాప్తుకు మార్గం సుగమం కావడంతో, అధికారులు ఆమెను ఎప్పుడైనా విచారణకు పిలిచే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ ఫోటోలతో హల్చల్ చేసే ఈ బ్యూటీ, ఇప్పుడు ఈ ‘చీటింగ్’ కేసు నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నందున, ఈ కేసులో మరిన్ని నిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Keerthi