ఈ వేసవిలో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునేందుకు ఒక క్రేజీ ప్రాజెక్ట్ సిద్ధమైంది. ‘ఈషా’ ఫేమ్ త్రిగుణ్, ‘పాపం ప్రతాప్’ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండెం నిర్మించిన ఈ చిత్రానికి మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించారు. మే 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం నిర్వహించిన ప్రెస్ మీట్ విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ అంటే అందరికీ ఆఫీస్ పని గుర్తొస్తుంది. కానీ ఈ సినిమాలో ఆ పదాన్ని చాలా క్రియేటివ్‌గా, సరదాగా వాడుకున్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా గురించి దర్శకుడు మధుదీప్ మాట్లాడుతూ… “మనం రోజూ చూసే పాత్రలు, మన చుట్టూ జరిగే సంఘటనలనే వెండితెరపై చూపిస్తున్నాం. ఇందులో ఒక అద్భుతమైన ప్రేమకథతో పాటు, నేటి సమాజానికి అవసరమైన ఒక మంచి క్లైమాక్స్ కూడా ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత అరవింద్ మాట్లాడుతూ… “పాయల్, త్రిగుణ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. టెక్నికల్‌గా సినిమా చాలా రిచ్‌గా ఉంది. నచ్చితే పదిమందికి చెప్పండి” అని ప్రేక్షకులను కోరారు.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ మాట్లాడుతూ తనకు తెలుగు పరిశ్రమపై ఉన్న ప్రేమును చాటుకున్నారు. ఇక్కడే సెటిల్ అవ్వాలని ఉందంటూ మనసులో మాట చెప్పారు. హీరో త్రిగుణ్ సైతం ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ సమ్మర్‌లో ఆడియన్స్‌కు ఒక ‘ఫుల్ మీల్స్’ లాంటి వినోదాన్ని పక్కాగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
చిన్న సినిమాగా అనిపించినా, ఇందులో ఉన్న నటీనటుల జాబితా చూస్తే షాక్ అవ్వాల్సిందే. శివాజీరాజా, హర్ష వర్ధన్, సత్య కృష్ణన్, ‘వైవా’ హర్ష, సప్తగిరి, వేణు యెల్దండి వంటి వెర్సటైల్ యాక్టర్స్ ఈ సినిమాలో ఉండటం విశేషం. ఇంతమంది కమెడియన్స్ ఉన్నారంటే సినిమా ఏ రేంజ్ లో నవ్విస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డిస్ట్రిబ్యూటర్ ముత్యాల రామ్ దాస్ మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ ఉంటే చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తాయని… ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ లో ఆ దమ్ము ఉంటుందన్నారు.
ప్రకాష్ చెరుకూరి, అరుణ్ చిలువేరు అందించిన మ్యూజిక్ ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి పనిచేయడం మరో హైలైట్. మే 15న థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘మిస్టర్’ ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి!