Find Articles

‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’ రివ్యూ

సరికొత్త కథాంశాలతో, ఊహించని మలుపులతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు, ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్‌కు కాస్త డార్క్ కామెడీ యాడ్ చేస్తే ఆ కిక్కే వేరు. సరిగ్గా అలాంటి కాన్సెప్ట్‌తోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న సినిమా ‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’. దేవుడి పేరుతో చేసిన ఓ స్కామ్, ఇంట్లో పడ్డ ఓ శవం.. ఈ రెండింటి చుట్టూ తిరిగే ఈ డార్క్ కామెడీ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

‘భరతనాట్యం 2: మోహినీయాట్టం’కథేంటంటే:
ఇంట్లో పెద్ద దిక్కు భరతన్ నాయర్ చనిపోగానే, ఆయన పెద్ద కొడుకు శశిధరన్ (సైజూ కురుప్) జీవితంలో అసలైన ఫ్యామిలీ కష్టాలు మొదలవుతాయి. తండ్రి తన కోసం ఆస్తులు కాకుండా పాపపు ఈఎంఐలు (EMIs) వదిలివెళ్లాడని అతనికి నెమ్మదిగా అర్థమవుతుంది. తండ్రికి వేరే కుటుంబం ఉందన్న షాక్ నుంచి తేరుకోకముందే నాన్నగారు ఏకంగాదేవుడి పేరుతో చేసిన ఓ స్కామ్ గురించి మైండ్ బ్లాంక్ అయ్యే నిజం తెలుస్తుంది. రెండో ఫ్యామిలీకి (పిన్ని రుక్మిణి, ఆమె కొడుకు) ఓ ఇల్లు కట్టించి ఇచ్చి సెటిల్ చేద్దాం అనుకునే టైమ్‌లో కథలోకి ఎంట్రీ ఇస్తాడు గోవిందరాజన్ (సూరజ్ వెంజరమూడు).భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ ‘మోహినేశ్వరి ఆలయం’ పేరుతో భరతన్ చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్‌ను బయటపెడతాడు. ఈ విషయం గుట్టు చప్పుడు కాకుండా ఉండాలంటే 75 లక్షలు ఇవ్వాలని, లేదా కేసును చనిపోయిన నాన్న మీదకు నెట్టేద్దామని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అనేదే సినిమా కధ.

విశ్లేషణ:
ఇది ఓ రకంగా  మోహన్‌లాల్ ‘దృశ్యం’కి ఫుల్ లెంగ్త్ కామెడీ వెర్షన్ అని చెప్పొచ్చు. ఒక శవాన్ని దాచే క్రమంలో వారు భయపడే ప్రతి సీన్ ప్రేక్షకుడికి మాత్రం నవ్వు తెప్పిస్తుంది. డార్క్ కామెడీకి అసలైన నిర్వచనం ఇదే. పాత్రలు ప్రొఫెషనల్ క్రిమినల్స్‌లా కాకుండా, పరీక్ష హాల్లో కాపీ కొడుతూ దొరికిపోయిన స్టూడెంట్స్‌లా టెన్షన్ పడటం భలే వర్కౌట్ అయింది. డార్క్ కామెడీ చిత్రాలు తీసేటప్పుడు దర్శకులు తరచుగా చేసే తప్పు.. కామెడీని డామినేట్ చేసేలా డార్క్‌నెస్‌ను పెంచేయడం. కానీ, ‘మోహినియాట్టం’ ఆ బ్యాలెన్స్‌ను పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేసింది. ఒకపక్క పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుంటూనే, మరోపక్క స్క్రీన్ మీద వాళ్ల అవస్థలు చూసి ఎంజాయ్ చేస్తాం. డబ్బుల కోసం గోవిందరాజన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక, సహనం నశించిన ఫ్యామిలీ మొత్తం కలిసి ఒకరోజు అతన్ని చంపేస్తారు. అక్కడి వరకు కాస్త సీరియస్‌గా, టెన్షన్‌తో సాగిన సినిమా.. ఆ తర్వాత “శవం మేనేజ్‌మెంట్ సర్వీసెస్”లా మారిపోతుంది. మనిషిని చంపడం కంటే, ఆ శవాన్ని దాచడం ఎంత కష్టమో ఈ కుటుంబానికి అప్పుడు తెలుస్తుంది. చనిపోయిన గోవిందరాజన్ కోసం వెతుక్కుంటూ వచ్చే వారిని హ్యాండిల్ చేయడానికి ఈ ఫ్యామిలీ పడే పాట్లు మామూలుగా నవ్వించవు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరో అబద్ధం చెబుతూ ఫ్యామిలీ అంతా క్రైమ్ పార్ట్‌నర్స్ అయిపోతారు. ఆ శవాన్ని ఎలా దాచాలనే వారి ప్లానింగ్.. ఏదో వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్ అడ్మిన్స్ మాట్లాడుకున్నంత సిల్లీగా ఉంటుంది. ‘గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఖాళీ స్థలం ఎక్కడుందో చూడరా’ లాంటి డైలాగ్స్ భలే పేలాయి. చివరికి ఈ డ్రామా ఎక్కడికి దారితీసింది? వారు కేసు నుంచి తప్పించుకున్నారా? అనేది తెరపైనే చూడాలి.

అసలు చూడచ్చా, ఎక్కడ చూడొచ్చు?:  ఈ ఎంగేజింగ్ డార్క్ కామెడీ థ్రిల్లర్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉంది. వీకెండ్ వాచ్‌కి పర్ఫెక్ట్ ఛాయిస్!

రేటింగ్: 3/5

Keerthi