Find Articles

సబ్బుకి ‘లక్ష్మీ పూజ’.. క్షమించమన్న అలీ

స్టార్ కమెడియన్ అలీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. దశాబ్దాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ఆయన.. తాజాగా నటించిన ఓ అడ్వర్టైజ్‌మెంట్ కారణంగా ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తీరుపై హిందూ సంఘాలు, నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇటీవల అలీ ఓ సబ్బుకు సంబంధించిన కమర్షియల్ యాడ్‌లో కనిపించారు. అందులో ఆయన ఏకంగా ఆ సబ్బుకు ‘లక్ష్మీ పూజ’ చేస్తున్నట్లుగా ఒక సీన్ చిత్రీకరించారు. దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్‌లో పవిత్రమైన లక్ష్మీదేవి మంత్రాలు స్పష్టంగా ప్లే అవ్వడం అసలు రచ్చకు దారితీసింది. వ్యాపార లాభాల కోసం ప్రమోట్ చేసుకునే ఒక సబ్బుకు.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పూజా విధానాన్ని, దేవతా మంత్రాలను ముడిపెట్టడం ఏంటని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ యాడ్ నెట్టింట వైరల్ కావడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. హిందూ ధర్మ విశ్వాసాలను, భక్తి భావాలను అలీ ఉద్దేశపూర్వకంగానే వెక్కిరిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దేవుళ్లను ఇలా కమర్షియల్ అవసరాలకు వాడుకోవడం ఏమాత్రం సరికాదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఇంకేముంది.. సోషల్ మీడియా వేదికగా అలీని బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మొదలైంది. వివాదం ముదిరి పాకాన పడటం, విమర్శల దాడి ఊహించని స్థాయికి చేరడంతో ఎట్టకేలకు నటుడు అలీ స్పందించారు. ఈ వివాదంపై వెనక్కి తగ్గి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈ యాడ్ వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే దయచేసి క్షమించాలని కోరారు. అయితే, ఇది కావాలని చేసింది కాదని.. గతంలో తాను నటించిన ఒక సినిమాలోని ఫన్నీ సన్నివేశం ఆధారంగానే యాడ్ మేకర్స్ ఈ కాన్సెప్ట్ డిజైన్ చేశారని ఆయన వివరణ ఇచ్చారు. ఎవరినీ, ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Keerthi