భారతీయ చలనచిత్ర రంగంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు సరిహద్దులు దాటి గ్లోబల్ మార్కెట్‌లో తన సత్తా చాటడానికి సిద్ధమైంది. ‘కేజీఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. ఈ కొత్త ప్రయాణానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది శ్రీకారం చుట్టడం విశేషం. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తర్వాత వస్తున్న చిత్రాల పట్ల ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో, హోంబలే ఫిల్మ్స్ తమ తొలి అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ వెంచర్‌గా ‘పెద్ది’ని ఎంచుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రూటెడ్ కథలను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించడంలో దిట్ట అయిన హోంబలే, ఈ చిత్రంతో ఓవర్సీస్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపడం ఖాయమనిపిస్తోంది.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రా యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో చరణ్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ అండ్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తుండటంతో మ్యూజికల్‌గా కూడా భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల మధ్య జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. హోంబలే ఫిల్మ్స్ స్వయంగా ఓవర్సీస్ పంపిణీ బాధ్యతలు చేపట్టడంతో ‘పెద్ది’ చిత్రానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్లు దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా, యూరప్, గల్ఫ్ దేశాలలో ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ భాగస్వామ్యం వల్ల సినిమా స్థాయి పెరగడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ మాస్ పవర్.. హోంబలే ఫిల్మ్స్ బ్రాండ్ వాల్యూ.. బుచ్చిబాబు విజన్.. ఈ ముగ్గురి కలయికతో జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సృష్టించబోయే విధ్వంసం చూడాలని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.