Find Articles

అండర్‌వాటర్ యాక్షన్‌తో రష్మిక వైల్డ్ అవతార్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (#MYSAA). ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రష్మికపై చిత్రీకరించిన ఒక కీలకమైన అండర్‌వాటర్ (నీటి అడుగున జరిగే) యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్‌ను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసింది.

నెట్టింట నిర్మాత, డైరెక్టర్ క్రేజీ పోస్ట్‌లు..

ఈ అండర్‌వాటర్ షెడ్యూల్ ముగియడంతో చిత్ర నిర్మాత అజయ్ సాయిపురెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందిస్తూ.. “రష్మిక మందన్నతో ప్లాన్ చేసిన ఎగ్జైటింగ్ అండర్‌వాటర్ సీక్వెన్స్ షూట్ పూర్తయింది” అని ప్రకటించారు.

కొద్దిరోజుల క్రితమే దర్శకుడు రవీంద్ర పుల్లే సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశారు. రష్మిక చేతి ముద్రలు ఉన్న షర్టును ఆయన ధరించి, “రక్తపు గుర్తులు త్వరలోనే రాబోతున్నాయి” అంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై నిర్మాణ సంస్థ ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ స్పందిస్తూ.. “మట్టితో సంతకం.. రక్తంతో గుర్తింపు. రష్మికతో #MYSAA షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఆమె తన అద్భుతమైన నటనతో స్క్రీన్‌పై రచ్చ చేయబోతోంది. 2026లో థియేటర్లలోకి వస్తున్నాం” అని పేర్కొంది. ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ.. “నా అందమైన ఆర్ట్‌లో కొంచెం రక్తం, అంబర్ పౌడర్ కూడా కలిపి ఉంటే బాగుండేది! నెక్స్ట్ టైమ్ కచ్చితంగా మిక్స్ చేద్దాం” అంటూ డైరెక్టర్‌తో సరదాగా చాట్ చేసింది.

బృందా మాస్టర్ కొరియోగ్రఫీ.. బ్యాంకాక్‌లో కఠిన శిక్షణ!

తాజాగా 10 రోజుల క్రితమే ఈ సినిమాలోని ఒక క్రేజీ సాంగ్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ నేతృత్వంలో రష్మికపై ఈ పాటను చిత్రీకరించారు.

ఈ సినిమా కోసం రష్మిక మందన్న నెక్స్ట్ లెవెల్‌లో కష్టపడుతోంది. ఇందులో ఆమె ఒక గిరిజన ‘గోండ్’ (Gond) జాతి అమ్మాయిగా నటిస్తోంది. ఈ పాత్రకు శారీరక దృఢత్వంతో పాటు ఎమోషన్స్ కూడా చాలా అవసరం. ఇందుకోసం రష్మిక థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ఒక ఇంటెన్సివ్ స్టంట్ అండ్ కాంబాట్ బూట్‌క్యాంప్‌లో రోజుకు 8 గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకుంది. ఆ శిక్షణ తర్వాత కేరళలో జరిగిన లాంగ్ షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్ కేచా ఖంఫక్డీ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో రష్మిక పాల్గొంది. కేరళ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి కావడంపై రష్మిక హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు థాంక్స్ చెప్పింది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రష్మికతో పాటు ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి యాక్షన్ సమకూరుస్తుండగా.. శ్రేయాస్ పి. కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం 2026లోనే వెండితెరపై సందడి చేయనుంది.

Keerthi