Find Articles

‘స్పిరిట్’కు బ్రేక్.. ‘ఫౌజీ’గా రంగంలోకి దిగిన ప్రభాస్!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్న రెబల్ స్టార్, ఇప్పుడు తన రూట్ మార్చి మరో ప్రతిష్టాత్మక చిత్రం కోసం రంగంలోకి దిగారు. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji) సినిమా లేటెస్ట్ షెడ్యూల్‌లో పాల్గొనేందుకు ప్రభాస్ సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన తన స్పిరిట్ షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇవ్వడం విశేషం.

రామోజీ ఫిలిం సిటీలో ప్రభాస్ ల్యాండింగ్!
‘ఫౌజీ’ చిత్రానికి సంబంధించి ఇప్పటికే గత కొన్ని రోజులుగా కీలకమైన సీన్స్ చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈరోజు నుంచి హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్‌లో ప్రభాస్ అడుగుపెట్టారు. అక్కడ రెండు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక షెడ్యూల్‌లో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ చిన్న షెడ్యూల్ పూర్తి కాగానే, ప్రభాస్ మళ్లీ ముందుగా అనుకున్న డేట్స్ ప్రకారం యథావిధిగా ‘స్పిరిట్’ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ‘ఫౌజీ’ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే పట్టుదలతో చిత్రబృందం ఉధృతంగా వర్క్ చేస్తోంది.

ఆర్మీ ఆఫీసర్‌గా ప్రభాస్.. తెలుగు సినీ చరిత్రలోనే ల్యాండ్ మార్క్ మూవీ!
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ సోల్జర్ (సైనికుడి) పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ద్వారా పాకిస్తానీ బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది.

ఇక ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా కథ అద్భుతంగా కుదిరిందని, హను రాఘవపూడి అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ మీద ఆవిష్కరిస్తే మాత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలోనే ఇదొక క్లాసిక్ మైలురాయిగా నిలిచిపోవడం ఖాయమని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. మనసును హత్తుకునే ప్రేమకథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన హను రాఘవపూడి.. ప్రభాస్ లాంటి మాస్ హీరోతో ఈ ఆర్మీ బ్యాక్‌డ్రాప్ స్టోరీని ప్లాన్ చేయడంతో అటు అభిమానుల్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Keerthi